మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 23 : కుల వ్యవస్థ, వర్ణ భేదాలు, లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్టులో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూఢాచారులకు, సంప్రదాయులకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసిన మొదటి సంఘ సేవకుడు ఆయనన్నారు. ఆయ న బోధనలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడే అన్నారు. నేటి మన పార్లమెంట్ వ్యవస్థకు సమానమైన అనుభవ మంటపాన్ని బసవేశ్వరుడు నాడే స్థాపించాడని గుర్తు చేశారు.
దేశం అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేయాలో మార్గనిర్దేశం చేసిన మహోన్నతుడని అన్నారు. మహిళలు, పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండాలి, కుల నిర్మూలన జరిగి మనిషి మనిషిగా జీవించాలని జాతికి గొప్ప సందేశమిచ్చిన మహానుభావుడని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహనీయుల జయంతులను నాటి పాలకులు మరిచారని, కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహనీయుల జయంతి వేడుకలతో వారి గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. మహనీయుల పేరుపై హైదరాబాద్ కోకాపేటలో రూ.100 కోట్ల విలువైన భూములను కేటాయించినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో కూడా బసవ భవన్ నిర్మించామని తెలిపారు. బసవేశ్వరుడి సేవలను ఆదర్శంగా తీసుకొని జిల్లాలో ఎందరో డాక్టర్లు, విద్యాసంస్థలను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని వివరించారు. అంతటి మహానేత చూపిన దారిలో అందరూ పయనించాలని మంత్రి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు రవికుమార్, విఠల్‌రెడ్డి, వెంకటేశ్, బీసీ సంక్షేమశాఖ అధికారిణి ఇందిర, జిల్లా వీరశైవ సమాజం నాయకులు వజ్రలింగం, శివుడు, శంకర్లింగం, శరవన్న, మల్లికార్జున్, నాగభూషణం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.