మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 2 : జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో గురువారం సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్నీ కొనసాగింది. ఈ పోటీల్లో బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచింది. రన్నరప్‌గా ఖమ్మం జట్టు, బాలికల విభాగంలో ఖమ్మం జట్టు విజయం సాధించగా రన్నరప్‌గా మహబూబ్‌నగర్ జట్టు నిలిచింది. బాలుర జట్లలో మూడో స్థానంలో నారాయణపేట, మేడ్చల్ జిల్లాల జట్లు, బాలికల విభాగంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా జట్లు నిలిచాయి.
చివరి వరకు ఉత్కంఠ..
బాలబాలికల విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠంగా కొనసాగాయి. ఆయా జట్ల మధ్య నువ్వానేనా అనే రీతీలో తలబడ్డాయి. చివరి వరకు పోరాడిన ఫైనల్ మ్యాచ్‌లో బాలుర మహబూబ్‌నగర్ జట్టు 19-16 పాయింట్ల తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం 23-06 పాయింట్ల తేడాతో మహబూబ్‌నగర్ జట్టుపై గెలుపొందింది. మూడో స్థానంలో బాలుర జట్లు నారాయణపేట్, మేడ్చల్ 12- 12 స్కోర్‌తో మ్యాచ్ డ్రా కాగా.. బాలికల జట్లు 12-12 తేడాతో రంగారెడ్డి, మేడ్చల్ జట్లు నిలిచాయి. అనంతరం విజేత జట్లకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా డీవైఎస్వో శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహకారంతో సీఎం కప్ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయని, రాష్ట్రస్థాయి పోటీలకు సహకరించిన క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో సత్యనారాయణ, పశువైద్యాధికారి మధుసూదన్‌రెడ్డి, నెట్‌బాల్ ప్రధాన కార్యాదర్శి ఖాజాఖాన్, ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి విలియం, యోగా సంఘం ప్రధాన కార్యదర్శి బాలరాజు, కురుమూర్తిగౌడ్, వేణుగోపాల్, రవీందర్‌రెడ్డి, విజయకుమార్, ఉమేశ్‌కుమార్, బాస్కెట్‌బాల్ కోచ్ ఫారుక్, స్వప్నసుధాకర్, అరుణజ్యోతి పాల్గొన్నారు.