కొల్లాపూర్, ఏప్రిల్ 11 : నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం అటవీ ప్రాంతంలో అక్కడకక్కడ సాసర్పిట్లను ఏర్పాటు చేయించింది. కానీ అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో సాసర్పిట్లలో నీళ్లు నింపకపోవడంతో వణ్యప్రాణులు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభలోనే ఉష్ణోగ్రతలు 39డిగ్రీలకు చేరుకోవడంతో వాగుల్లో నీటి చెలిమలు ఇప్పటికే ఆవిరి అయిపోయాయి.కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నలమల్ల అటవీ ప్రాంతంలో అక్కడకక్కడ సాసర్పిట్లు ఉండగా వాటిలో నీళ్లు నింపడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నా రు.
దీంతో వణ్యప్రాణులు దాహార్తితో అలమట్టిస్తున్నాయి. దాహార్తితో అడవి జంతువులు మైదాన ప్రాంతంలోకి వస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కృష్ణానది తీరం వెంట దాహార్తి తీర్చుకోవడానికి వచ్చిన జంతువులు అడవి గొర్రెలు, దుప్పిలు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అడవిలో జంతువులు దాహాం తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన సాసర్ల్ల్లో, కుంటలను నీళ్లతో నింపాల్సిన తక్షణ అవసరం ఉంది.
కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 36,872హెక్టార్లలో దట్టమైన అడవి విస్తరించి ఉంది. గత లెక్కల ప్రకారం 13పెద్దపులులతో పాటు చిరుత పులులు, వందలాది శాఖహార జంతువులు ఉన్నాయి. ఎండకాలంలో దాహార్తిని తీర్చుకునేందుకు అడవి దాటి బయటకు రా కుండా ఉండేందుకు పదుల సంఖ్యలో సాసర్లతో పాటు కృతిమ కుంటలు, బోర్లను అ టవీ శాఖ ఏర్పాటు చేసింది. కానీ ఏప్రిల్ నెల లో ఇప్పటికే ఎండలు ముదిరినా సాసర్ల్లో నీళ్ల నింపకపోవడంతో సమీప గ్రామాల్లోకి వస్తాయని ప్రజలుఆందోళన చెందుతున్నారు.
మా గ్రామానికి వెళ్లే దారిలో ఉండే సాసర్ల్లో నీళ్లు లేవు. మా గ్రామానికి సమీపంలో గతేడాది పెద్దపులి మృత్యువాత పడింది. దీంతో మా గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దాహం కోసం వచ్చి ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి సాసర్లను నీళ్లతో నింపాలి.
– భరత్, అమరగిరి
నల్లమల అభయారణ్యం మన ప్రాంతానికి మాణిక్యం లాంటిందని, అందులోని అడవి జంతువులను కాపాడుకోవాల్సి బాధ్య త అందరిపై ఉంది. అటవీ అధికారులు స్పందించి అడవి జంతువులకు దాహార్తి తీర్చేంచేందుకు ఏర్పాట్లు చేయాలి. సాసర్ల్లో నీళ్లు నింపేందుకు చెంచుల సహకారం తీసుకొని ఉపాధి కల్పించాలి.
– మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్,అమరగిరి