మరో 64 రోజుల్లో ప్రారంభమయ్యే పరీక్షల్లో మార్క్ చూపాలంటే ‘పది’ంతల ప్రణాళిక అవసరం. ఇందుకోసం నిత్యం ప్రిపరేషన్ అవసరమని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మెళకువలు, రివిజన్ ప్రధానమని.. ఫాలో అవుతేనే ఎస్ఎస్సీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. గతేడాది రిజల్ట్స్ కన్నా మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటికే ఎడ్యూకేషన్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలుగును సులువుగా చదివేలా.. సాధనతోనే హిందీలో మార్పు లొచ్చేలా.. ఆంగ్లంపై ఆందోళన లేకుండా.. భౌ‘తికమక’ పడకుండా.. లెక్క తప్పకుండా.. సాంఘిక శాస్త్రంలో చరిత్ర సృష్టించేలా.. విద్యా శాఖాధికారులు అడుగులు వేస్తున్నారు.
– మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 16
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం. ఈ ఏడాది మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్నద్ధతకు ఉపాధ్యాయుల కృషితోపాటు తల్లిదండ్రులు సహకారం ముఖ్యం. ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ మొదలు పెడితేనే విజయం సాధించవచ్చు. గతేడాది ఎస్ఎస్సీ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 28, నారాయణపేట 15, నాగర్‌కర్నూల్ 23, వనపర్తి 29, జోగుళాంబ-గద్వాల జిల్లా 32వ స్థానాల్లో నిలిచాయి. లాస్ట్ ఇయర్ రిజల్ట్ పునరావృతం కాకుండా.. రాష్ట్రస్థాయిలో టాప్ 10లో ఉండేలా.. మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్న ది. ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు సిలబస్ పూర్తి కాగా.. ఫిబ్రవరి వరకు మరోసారి రివిజన్ చేయనున్నారు. మాదిరి పరీక్షల ప్రశ్నాపత్రాలను అందించి సన్నద్ధం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు బాగా చదివేలా వారి తల్లిదండ్రులు సైతం చొరవ తీసుకోవాల్సి ఉన్నది.
64 రోజుల గడువే..
పది పరీక్షలకు 64 రోజుల గడువే మిగిలింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రణాళిక ప్రకారం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతేడాది సామాన్యశాస్త్రం, ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో విద్యార్థులు అధికంగా తప్పారు. ఈసారి విద్యాశాఖ అధికారులు పక్కాగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. గతేడాది విద్యార్థులు అధికంగా తప్పిన సబ్జెక్టులపై దృష్టి సారించాలి. ముఖ్యంగా రెగ్యులర్ తరగతులతోపాటు, ప్రత్యేక తరగతుల్లో అభ్యాస దీపిక ప్రశ్నలను విద్యార్థులతో నిత్యం సాధన చేయించాలి. రివిజన్లో భాగంగా ప్రతిరోజు పాఠం వివరించి, మరుసటి రోజు దానిపై పరీక్ష నిర్వహించాలి. విద్యార్థులు చేసిన తప్పులను గుర్తించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే చేతిరాత కీలకమని తెలిపి, మెరుగుపర్చడానికి కృషి చేయాలి. పాత ప్రశ్నాపత్రాలతో జవాబులు రాయించాలి. పదిలో తక్కువ సమయంలో సులభంగా పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో 4,182 పాఠశాలలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మొత్తం 4,182 ఉన్నాయి. వాటి పరిధిలో 5.42 లక్షల మందికిపైగా బాలబాలికలు చదువుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో హైస్కూళ్లు 287, నాగర్‌కర్నూల్ జిల్లాలో 236, జోగుళాంబ-గద్వాల జిల్లాలో 154, వనపర్తి జిల్లాలో 192, నారాయణపేట జిల్లాలో 139 ఉన్నాయి. గతేడాది మార్చి-2024లో ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట జిల్లాలో 7,655 మంది, నాగర్‌కర్నూల్‌లో 10,507, మహబూబ్‌నగర్ జిల్లాలో 12,673, వనపర్తి జిల్లాలో 6,899, జోగుళాంబ గద్వాల జిల్లాలో 7,175 మంది విద్యార్థులు పది తరగతి పరీక్షలు రాశారు.
అన్వయించుకుంటే అ‘సామాన్య’ ఫలితం
దైనందిన జీవితంలో సైన్స్ సూత్రాలను అన్వయించుకుంటూ ముందుకు సాగటంతో సామాన్య శాస్త్రంపై పట్టు పెరుగుతుంది. గత ప్రశ్నాపత్రాలతోపాటు ప్రయోగ విధానంపై దృష్టి సారించాలి. ప్రతి పాఠంలో బొమ్మలను సాధన చేస్తూ వాటి భాగాలను గుర్తించాలి. పట్టికల విశ్లేషణ ముఖ్యమైన అంశం. ప్రయోగ విధానాలు, పరికల్పనలు, బొమ్మలు గీయటం, పట్టికల సాధనతో అధిక మార్కులు సాధించవచ్చు. విద్యార్థులు బాగా చదివేలా వారి వారి తల్లిదండ్రులు దోహదపడాలి.
– పీ.సాయిబాబా, సామాన్య శాస్త్రం ఉపాధ్యాయుడు, మహబూబ్‌నగర్
లెక్కల్లో గట్టెక్కాలంటే..
గణితంలో ప్రతి ప్రశ్నకు దత్తాంశం రాస్తే మార్కులు కేటాయిస్తారు. దత్తాంశం రాయడం ప్రాక్టీస్ చేయాలి. 3వ, 4వ, 14వ అధ్యాయాలలోని గ్రాప్ ప్రశ్నలు, 8వ, 9వ అధ్యాయ నంలోని నిర్మాణాలకు సంబంధించిన ప్రశ్నలు నేర్చుకోవడం, 10వ, 14వ అధ్యాయనాల్లోని సూత్రాలు బాగా ప్రాక్టీస్ చేస్తే మార్కులు పొందొచ్చు. సమితులు అధ్యాయంలోని వెన్ చిత్రాలు గీయడం, త్రికోణమితి అనువర్తనాలు అధ్యాయంలోని పద సమస్యలకు పటాలు గీయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి అధ్యాయంలోని నిరూపణ చేసే సమస్యలు ప్రాక్టీస్ చేయాలి. పార్ట్-బీకి 20 మార్కులు కేటాయించబడ్డాయి. ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో వచ్చిన ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి.
– ఎండీ.ఫసియొద్దీన్, గణితం ఉపాధ్యాయుడు, మహబూబ్‌నగర్
ఆంగ్లంలో అక్షర దోషాలు ఉండొద్దు
తెలుగు మాధ్యమం విద్యార్థులు ఆందోళన చెందొద్దు. సారాంశాన్ని గ్రహించి సొంతంగా నోట్స్ రాసుకోవాలి.పార్ట్ ఏ, బీ, సీ సెక్షన్‌పై అవగాహన పెంచుకోవాలి. అక్షర దోషాలు ఉండొద్దు. టెక్ట్స్ డిపెండెంట్, ఇండిపెండెంట్ అంశాలపై పట్టు సాధించాలి. పద్యభాగంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్.. యాక్టివ్ వాయిస్, వ్యాసాలను చదవటంతోపాటు సాధన చేయాలి.
– బ్యూలా, ఆంగ్ల ఉపాధ్యాయురాలు, మహబూబ్‌నగర్
ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక
ఈ ఏడాది పదిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. గత వార్షిక ఫలితాల్లో సాధించిన ఫలితాల కంటే మరింత మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి అవసరం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించాం. గతేడాది తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలల్లో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తాం.
– ఏ.ప్రవీణ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్
సాంఘిక శాస్త్రం.. అవగాహనే కీలకం
తేలికైన వాటిని ముందుగా చదివి కఠిన అంశాలను బాగా సాధన చేయాలి. పటాల నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు, ప్రశంస సున్నితత్వం, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యలు రాయటంపై దృష్టి సారించాలి. పటాలు, పట్టికలు, గ్రాఫ్‌లపై పట్టుంటే ఎక్కువ మార్కులొస్తాయి. పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. ‘అభ్యాస దీపిక’లోని అంశాలను బాగా చదవాలి.
– కే.కవిత, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయురాలు, మహబూబ్‌నగర్