ధరూరు/అచ్చంపేట, జూలై 29 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తడంతో పర్యాటకులు పోటెత్తారు. దీంతో ప్రాజెక్ట్ పరిసరాలు కిటకిటలాడాయి.
ఆది, సోమవారం సెలవు దినాలు కావడంతో తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ర్టాల ప్రజలు కుటుంబసమేతంగా వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తునారు. ప్రాజెక్టుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ యువత, మహిళలు సందడి చేస్తున్నారు. కొందరు అక్కడే బర్త్డే వేడుకలు కూడా నిర్వహించుకున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు వాహనాలు ఆగకుండా చర్యలు చేపట్టారు. ఎడమ కాల్వ వద్ద చేపల ఫ్రై రుచిని ఆస్వాదించేందుకు ప్రజలు ఎగబడ్డారు.