శ్రీరంగాపూర్, ఫిబ్రవరి 26: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రంగనాథుడు వెలిసిన శ్రీరంగం తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ పుణ్యకేత్రం. ఆ క్షేత్రానికి సమానంగా తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలకేంద్రంలో వనపర్తి సంస్థనాధీశులైన రాజారామేశ్వరరావు ఆయన సతీమణి రాణి శంకరమ్మ పేరుమీద శాలివాహన శకం 1804లో రంగనాథస్వామి ఆలయం నిర్మించారు.
తమిళనాడులోని శ్రీరంగం వెళ్లి రంగనాథస్వామిని దర్శించుకునేందుకు వీలుకాని భక్తులు శ్రీరంగాపూర్ రంగనాథస్వామిని దర్శించుకోవడం విశేషం. మంగళవారం నుంచి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అందుకనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నారు.
మార్చి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రంగనాథస్వామి ఆలయం ఆహ్లాదకర వాతావరణంలో అద్భుత శిల్పకళ ఉట్టిపడేలా భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. హైదరాబాద్-కర్నూల్ 44వ జాతీయ రహదారిలో పెబ్బేరు నుంచి 11కిలోమీటర్లు, వనపర్తి నుంచి 24కిలోమీటర్ల దూరంలో రంగనాథస్వామి ఆలయం ఉన్నది. పెబ్బేరు, వనపర్తి నుంచి నిత్యం బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
మొదటిరోజు మంగళవారం కొయిలాళ్వార్ తిరుమంజనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, మృత్యంగ్రహణం, అంకురార్పన, మార్చి 1న ధ్వజారోహణం, దేవతాహ్వానం, భేరీపూజ, 2వ తేదీన శ్రీవారి మూలమంత్ర హవనం, సూర్యప్రభ వాహనసేవ, 3న శేషవాహన తిరువీధిసేవ, 4న హనుమద్వాహన సేవ, మంటపోత్సవం, 5న చతుస్థానార్చన, మోహినీ అలంకరణ, గరుడవాహన సేవ, శ్రీవారి కల్యాణం, 6న శ్రీవారి తిరువీధిసేవ, రథాంగహోమం, గజవాహనసేవ నిర్వహించనున్నారు. అలాగే 7వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. 8వ తేదీన శ్రీవారి మూలమంత్ర హవనం, పారువేట, అశ్వవాహనసేవ, 9న పూర్ణాహుతి, అవభృతం, ధ్వజావరోహణం, తీర్థప్రసాద వితరణ, నాగవల్లి పూజలు నిర్వహించనున్నారు.