నాగర్ కర్నూల్ : నాగర్కర్నూల్ ( Nagarkurnool ) మండలం శ్రీపురంలోని అత్యంత పురాతన శ్రీరంగనాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam ) జూన్ 4నుంచి 7 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవ వేడుకల కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ధర్మకర్త రంగాచార్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్ 4న అభిషేకం, తిరుమంజనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యా వచనం, రక్షా బంధనం, అంకురార్పణ, 5న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, 6న ఉదయం శ్రీ గోదా రంగనాయకస్వామి కల్యాణం, సాయంత్రం రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 7న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, దేవతోద్వాసన, ద్వాదశరాధన, ధ్వజారోహణం, కుంభ ప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, వినోదాచార్యులు, గంధం ప్రసాద్, చంద్రనారాయణ, వరదయ్య, దురెడ్డి రవీందర్ రెడ్డి, మారం మాధవ్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, మల్లికార్జున్, టీవీ రవి తదితరులు పాల్గొన్నారు.