శ్రీరంగాపూర్, మార్చి 7: గోవిందనామస్మరణతో శ్రీరంగనాథుడి రథం ముందుకు కదిలింది. శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీరంగనాథుడు రథంపై విహరిస్తుండగా వేలాదిమంది భక్తులు స్మామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మండలకేంద్రంలోని రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం రథోత్సవం కనులపండువగా సాగింది.
ముందుగా ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు స్మామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథం వద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు రథానికి రథాంగపూజ నిర్వహించి ఉత్సవమూర్తులను రథంపైకి చేర్చారు. ముందుగా ఆలయ ధర్మకర్త చేతులమీదుగా రథాన్ని లాగి లాంఛనంగా ప్రారంభించారు. రంగనాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం గోదాదేవి ఆలయం వరకు గోవిందనామస్మరణతో వైభవంగా సాగింది. రథంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అదేవిధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి రథోత్సవంలో పాల్గొన్నారు. జాతరలో మిఠాయిలు, ఆటవస్తువుల దుకాణాలు వెలిశాయి. రథోత్సవానికి వచ్చిన భక్తుల కోసం శ్రీహరి మిత్రబృందం పులిహోర, తాగునీటి సౌకర్యం ఏర్చాటు చేశారు. అదేవిధంగా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ వినీలారాణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.