‘గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా.. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా’.. ‘జయ జనార్దన.. క్రిష్ణ రాధికా పతే.. జన విమోచనా క్రిష్ణ జన్మ మోచనా’.. ‘ముకుందా.. ముకుందా.. క్రిష్ణా ముకుందా.. ముకుందా’.. అన్న పాటలు హోరెత్తాయి. సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. నెత్తిన నెమలి పింఛం.. చేతిలో పిల్లనగ్రోవి.. మోమున చిరుమందహాసంతో నల్లనయ్య గోపికలతో కలిసి విహరించడంతో ఇలా బృందావనంలా మారింది.
ఇస్కాన్ ఆలయాలను సుందరంగా ముస్తాబు చేయగా.. గోవర్ధన గిరిధారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. కన్నయ్య, గోపికల వేషధారణలో చిన్నారులు ముద్దులొలికించగా చూసి వారి తల్లిదండ్రులు మురిసిపోయారు. సాయంత్రం పలు ప్రాంతాల్లో ఉట్ల వేడుక సంబురంగా సాగింది. చిన్నారులు, యువకులు ఉట్లు కొట్టేందుకు పోటీపడగా.. ప్రజలు ఉత్సాహ పరిచారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, ఆగస్టు 26