అచ్చంపేట, డిసెంబర్ 13 : పేదలు అధికంగా నివసిస్తున్న మహేంద్రనగర్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. మంగళవారం ఉదయం బస్తీబాటలో భాగంగా పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని మహేంద్రనగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు కావాలని, పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీవాసులను పేరుపేరునా పలుకరించారు. కుటుంబ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వృద్ధులు, పేదలకు పింఛన్లు, ఇంటింటికీ మిషన్ భగీరథతో శుద్ధమైన నీళ్లు వస్తున్నాయని, ఇందుకు కారణమైన సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని పేదలు దీవించారు. మళ్లీ ముఖ్యమంత్రినే గెలిపిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పేదలు అంటే తనకు ఇష్టమన్నారు. తన వెంట పేదలు ఉంటారని, వారి కోసమే తాను నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. వలస కూలీ కడుపులో పుట్టిన తనకు పేదల కష్టాలు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఎక్కడికి వెళ్లినా నేరుగా పేదలను కలిసి వారి సమస్యలు తెలుసుకోని పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా కొడుకుగా, బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. మహేంద్రనగర్ కాలనీలో కొత్తగా సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు కేటాయించి మంజూరు చేస్తానన్నారు.
అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.19 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు. అంతకుముందు విప్ గువ్వలకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, కమిషనర్ బలరాంనాయక్, కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు.