వనపర్తి టౌన్, జనవరి 18 : నకిలీ ధని యాప్ ద్వారా రూ.4కోట్లు ఖాజేసిన సైబర్ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. శనివారం ఆయన వనపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వనపర్తి పట్టణానికి చెందిన టి.రాజు వృత్తిరీత్యా మెకానిక్. బాలానగర్‌లో నివాసం ఉంటూ ఫేస్బుక్లో ధని పైనాన్స్ లోన్ యాప్ చూసి వివరాల కోసం చూశాడన్నారు. రూ.3లక్షల లోన్ ఇస్తామని, ప్రాసెసింగ్ కోసం రూ.8,860 చెల్లించాలని యాప్ నిర్వాహకులు చెప్పారు. డబ్బులు వేయడంతో లోన్ మంజూరైందని, రాత్రి వరకు డబ్బులు వేస్తామని మరో రూ.6850 వసూలు చేశారు.
ఇలా మొత్తం 15,710 వసూలు చేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశారన్నారు. మోసపోయానని గ్రహించిన రాజు పట్టణ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి జిల్లా సైబర్ సెక్యురిటీ బ్యూరో రత్నం, రవిప్రకాశ్, సీఐ కృష్ణయ్య దర్యాప్తు చేపట్టారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోగా.. వారిచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు సైబర్ నేరగాళ్లను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గోపాల్పేట మండలం నర్సింగాయిపల్లికి చెందిన గగనం ప్రకాశ్ (పెయింటర్), వనపర్తికి చెందిన చీర్ల రవిసాగర్, గుంటి రాజశేఖర్, దేవర్ల సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కోలకత్తా, బీహార్‌లోని పాట్నాలో ఉన్న అంకిత్, రాహుల్, పంకజ్‌తో కలిసి మోసాలకు పాల్పడేవారని, వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారన్నారు. అంకిత్, రాహుల్, పంకజ్‌ల వారి వాటా కింద 70 శాతం, ప్రకాశ్, రవిసాగర్, రాజశేఖర్, సాయికుమార్ వాటా 30శాతంగా తీసుకొని తెలుగు రాష్ర్టాల్లో సుమారు 15వేల మందికి ఫోన్ చేసి వెయ్యి మందికిపైగా మోసగించి రూ.4కోట్లు ఖాజేశారని వెల్లడించారు.
వచ్చిన డబ్బులతో విలాసవంతమైన ఇండ్లు, వాహనాలను గుర్తించామని, కోర్టు అనుమతితో వాటిని స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ చెప్పారు. ఫేక్ ఫోన్‌కాల్స్, సామాజిక మాద్యమాల్లో వచ్చిన యాప్‌ల ద్వారా లోన్లు తీసుకోవడం, బ్యాంక్ సంబంధిత సమాచారం తెలుపవద్దని సూచించారు. మోసపోతే వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్సై హరిప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.