అచ్చంపేట, మార్చి 4 : శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న తెగిపోయిన కన్వేయర్ బెల్టును ఎట్టకేలకు పునరుద్ధ్దరించారు. కన్వేయర్ బెల్టు పునరుద్ధరణతో సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంగళవారం కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ లోపల పేరుకుపోయిన బండరాళ్లు, మట్టి, బురదను బయటకు చేరవేస్తున్నారు. బెల్టుద్వారా గంటకు 800 టన్నుల మట్టి, బండరాళ్లు బయటకు డంప్ చేస్తున్నారు. టన్నెల్ లోపల 17వేల క్యూబిక్‌ల బురద కూరుకుపోయింది. గ్యాస్‌కట్టర్‌తో బోరింగ్ మిషన్ విడిభాగాలను కటింగ్ చేస్తున్నారు.
కటింగ్ భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కోసం జీపీఆర్ డేటా ఆధారంగా టన్నెల్ లోపల తవ్వకాలు జరుపుతున్నారు. టీబీఎం మిషన్ ముందుభాగం, వెనుకభాగంలో చికున్నవారి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. మూడు చోట్ల ఎన్జీఆర్ఐ గుర్తించిన స్థలాల్లో దాదాపు పదిఫీట్ల వరకు తవ్వకాలు జరిపినా మట్టి, నీరు మాత్రమే వస్తుంది. అదేవిధంగా టన్నెల్పైభాగంలోంచి దాదాపు 450 మీటర్ల నుంచి టన్నెల్లోకి భారీగా ఊట నీరు వచ్చి చేరుతున్నది. నిమిషానికి 5వేల లీటర్ల వరకు ఊటనీరు రావడంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది.
ఆ నీటిని బయటకు పంపించేందుకు డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిప్టులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. టీబీఎం మిషన్ కిందిభాగం, ముందుభాగంలో శిథిలాల కింద మృతదేహాలు ఉండొచ్చని తవ్వకాలు జరుపుతున్నారు. అయితే గ్రౌండ్ పెనిట్రేడింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా టన్నెల్ లోపల స్కానింగ్ చేస్తుండగా ఐదుచోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం మిషన్ దెబ్బతిన్న ముందు, వెనుక భాగంలో మెత్తని భాగాలను గుర్తించారు. చిక్కుకున్న వారు అక్కడే ఉండొచ్చని భావిస్తున్నారు. సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా మృతదేహాల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు.
సహాయక చర్యలు వేగవంతం
కన్వేయర్బెల్టు పునరుద్ధ్దరించడంతో రెస్క్యూబృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఢిల్లీ నుంచి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం చేరున్నది. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్ రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో టన్నెల్ ఇన్లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాల అధికారులతో జరిపిన సమీక్షలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి, టీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ వైభవ్‌గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.