మహబూబ్‌నగర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ఘట్టం పూర్తి కానున్నది. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొల్లాపూర్‌లో ఇద్దరు, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అలంపూర్, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి బీరం విజయ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఎల్లేని సుధాకర్‌రావు నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కల్వకుర్తి నియెజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బాదేపల్లి రాజు, మహబూబ్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్, నాగర్‌కర్నూల్ నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ నుంచి కె.శంకర్, అలంపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రేమలత పల్లయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.