కొల్లాపూర్, జనవరి 14 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత అంతటి ప్రాచుర్యం పొంది ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది నాగర్కర్నూల్ జిల్లా కొ ల్లాపూర్ మండలంలోని సింగవట్నం లక్ష్మీనరసింహస్వామి పు ణ్యక్షేత్రం. కృష్ణమ్మ పరవళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న క్షేత్రానికి రాష్ట్ర ప్రజలే కాకుండా కర్ణాటక, ఆంధ్ర ప్రాంతా ల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి వారి ఆలయానికి ఎదురుగా రత్నగిరి కొండపై లక్ష్మీదేవి కొలువై ఉన్నది.
ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి లింగాకారంలో ఉండడం విశేషం. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. నెలపాటు సాగే జాతరకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఆలయం చెంతనే అతిపురాతనమైన శ్రీవారిసముద్రం చెరువు కృష్ణానది నీటితో తొణికిసలాడుతున్నది. భక్తులు నీటిలో విహరించేందు కు టూరిజంశాఖ ఆధ్వర్యంలో జెట్ పడవను ఏర్పాటు చేశారు. భక్తుల విడిది కోసం టూరిజంశాఖ కాటేజీలున్నాయి.
స్వామి వారు ఇక్కడ వెలియడం వెనుక ఆసక్తికరమై న ఇతిహాసం ఉన్నది. 500 ఏండ్ల కిందట సురభివంశం 11వ తరం రాజు సింగమనాయుడు జటప్రోలు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఆయన రాజ్యంలో ఓ రైతు తన పొలంలో అరక దున్నుతుండగా లింగరూపంలో ఉన్న శిల నాగలి కర్రకు అడ్డుతగిలింది. రైతు ఆ శిలను పక్కకు తీసేశాడు. అయినా ఆ శిల మళ్లీ మళ్లీ నాగలికి అడ్డుపడుతూనే ఉంది. దీంతో ఆ రైతు ఆందోళనకు గురై తనను ఏ శక్తీ వేధించకూడదని ప్రార్థించాడు. తర్వాత సింగమనాయుని కలలో నరసింహస్వామి శిల రూ పంతో కనిపించాడు.
ఈ ప్రాంతానికి ఉత్తర దిశలో ఉన్న పొ లంలో తాను లింగాకారంలో వెలిశానని, రోజూ రైతు నాగలికి అడ్డుతగులుతున్నా అతడు తనను నరసింహస్వామిగా గుర్తించడం లేదని చెప్పాడు. అదే రోజు నడిజాములో తనను గుర్తిం చి ప్రతిష్ఠించి పూజలు చేయాలన్నాడు. సింగమనాయుడు నిద్రలేచి తనకొచ్చిన కల నిజమా కాదా అని తెలుసుకునేందుకు సైన్యంతో పొలానికి వెళ్లి కాగడాల సాయంతో వెతికారు. లింగరూపంలో వెలిగిపోతున్న శిల కనిపించింది. కలలో దేవుడు చెప్పిన పోలికలన్నీ ఉండడంతో అప్పటికప్పుడు లింగాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి.