జడ్చర్ల, డిసెంబర్ 19: నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపు ఇచ్చినవారవుతారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జడ్చర్లలోని లయన్స్‌క్లబ్ భవనంలో జడ్చర్ల లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల సహకారంతో కంటి వైద్యశిబిరం, ప్రభుత్వ డిగ్రీకళాశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేత్రదానం చేయడంతో ఇద్దరికి కంటిచూపు వస్తుందన్నారు. అదేవిధంగా అవయవదానం గొప్ప కార్యక్రమమని, అవయవదానం చేయడంతో మనిషి చనిపోయినా మరో ఐదారుగురికి మంచి జరుగుతుందన్నారు. దీనిపై అవగాహన కల్పించాల్సి అవసరం ఉందన్నారు. లయన్స్ క్లబ్ వారు తమవంతు సాయంగా ప్రజలకు ఉచితకంటి వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇక్కడ కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటిచూపు బాగుండాలనే ఉద్దేశంతో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. రెండోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిచనున్నారని పేర్కొన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి కంటివైద్యం చేయించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి అద్దాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతరుల ప్రాణాలను రక్షించిన వారవుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర సంగీతనాటక అకాడమి మాజీ చైర్మన్ శివకుమార్, మార్కెట్‌చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు డాక్టర్ రాంరెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ నటరాజ్, ప్రవీణ్, మురళి, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, సతీశ్, లత, చైతన్య, రమేశ్, చైతన్యనాయక్, సలోమి, దానిష్, నాయకులు ఉన్నారు.