వనపర్తి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఏ చెరువును చూసినా ఖాళీ కుండల్లా దర్శనమిస్తున్నాయి.. గత పక్షం రోజులకుపైగా జిల్లాలో వర్షాల ప్రభావం కనిపిస్తున్నా వాగులు.. వంకలు పారిన దాఖలాలు లేవు.. నామమాత్రంగా కూడా చెరువుల్లో నీరు చేరకపోవడంతో అన్ని బోసిపోయి కనిపిస్తున్నాయి.. ఆగస్టు నెలలోకి వచ్చినా అధికశాతం చెరువులన్నీ ఒట్టిపోయి కనిపిస్తున్నాయి.. కేవలం జూరాల ఆధారంగానే వానకాలం సాగు కొంతమేర ఆశలు కలిగిస్తున్నా.. ఎంజీకేఎల్ఐ, భీమా ఎత్తిపోతల పథకాల మీద ఆధారపడిన రైతులు అయోమయానికి గురవుతున్నారు.. ఎగువన కురిసిన వర్షాలకు నదుల్లో నీళ్లకు కొదవలేకున్నా.. జిల్లాలో అధికశాతం ఉన్న చెరువుల్లో మాత్రం చుక్క నీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
భీమా ప్రాజెక్టు-2 ద్వారా జిల్లాలోని 154 చెరువులకు నీరు చేరే అవకాశం ఉన్నది. అయితే ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఇందులో భాగంగా గత పక్షం రోజుల నుంచి జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. వీటిలో భీమా ప్రాజెక్టు-2 ద్వారా చెరువులను నింపే ప్రక్రియ ఇటీవలే మొదలైంది. ఇప్పటి వరకు కేవలం 11చెరువులకు మాత్రమే నీరు చేరింది. మిగితా వాటికి క్రమంగా నీరు చేరుతున్నది. 8 మండలాల పరిధిలో భీమా-2 ద్వారా సుమారు 64 కిలో మీటర్ల మేర 27వ ప్యాకేజీ ద్వారా నీటి పంపిణీ కొనసాగనుంది. ఈ 27వ ప్యాకేజీతోపాటు 15, 16, 19 ప్యాకేజీల ద్వారాను నీటి సరఫరా కొనసాగాల్సి ఉన్నది. ఈ చెరువులన్నీ నిండాలంటే, కనీసం నెల రోజులకుపైగా పంపింగ్ చేస్తే తప్పా వాటిని నింపడం సాధ్యం కాదు.
జిల్లాలో అధికంగా ఎంజీకేఎల్ఐ ద్వారా వానకాలం పంటలు సాగు చేస్తారు. ఎంజీకేఎల్ఐ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ ద్వారా 29వ ప్యాకేజీ నుంచి వనపర్తి జిల్లాకు సాగునీరు అందుతుంది. అలాగే జొన్నలబొగుడ రిజర్వాయర్ ద్వారా 28వ ప్యాకేజీ నుంచి పసుపుల బ్రాంచి కెనాల్ (పీబీసీ) ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల చెరువులకు సాగునీరందుతుంది. కేఎల్ఐ పరిధిలో జిల్లాలోని దాదాపు 175 చెరువులకు సాగునీరు అందాల్సి ఉంది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం 60వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఇటీవల మూడు రోజుల కిందట గుడిపల్లి నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. ఇంకా ఇప్పటివరకు చెరువులు నిండిన దాఖలా లు లేవు. ఇంత పెద్ద మొత్తంలో చెరువులకు నీళ్లు రావాలంటే కనీసం 45 రోజులు పట్టే అవకాశం ఉంది. వ ర్షాలు అంతంతే ఉండటంతో అన్నదాతలు ఆశించినమేరకు వానకాలం పంటల సాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వర్షపాతాన్ని పరిశీలిస్తే.. జూన్లో 124.2 మి.మీ. ఉంటే, నార్మల్ వర్షపాతం 75.8 మి. మీ.గా నమోదు కాగా, పెద్దమందడి, గోపాల్పేట మండలాల్లో సాధారణ వర్షపాతం, పెబ్బేరులో తక్కువగా నమోదైంది. అలాగే జూలైలోనూ 224.1 మి.మీ. గా నమోదు కాగా, సాధారణం 143.9 మి.మీ.గా నమోదైంది. ఈ లెక్కన మెట్టపంటల సాగుకు జూన్, జూలైలో కురిసిన వర్షాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ వరి సా గుకే ఆలస్యం అవుతున్నదని రైతులు ఆందోళనకు చెందుతున్నారు.
ప్రతి ఏటా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల.. సాగుబడులకు సంబంధించి శనివారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయంలో శివం(స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్) సమావేశం నిర్వహిస్తారు. ఇందులో చీఫ్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు పాల్గొని ఏ ప్రాజెక్టు కింద ఎంత సాగు చేయాలన్న నిర్ణయాలు చేస్తారు. ఈ మేరకు ప్రాజెక్టుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నందునా జూరాల కింద ఆయకట్టుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇక మిగిలిన ఎత్తిపోతల పథకాలపైనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి శివం మీటింగ్లో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 15 రోజుల నుంచి భీమా ఎత్తిపోతల నుంచి నీటిని పారిస్తున్నట్లు నీటి పారుదల శాఖ వనపర్తి జిల్లా ఎస్ఈ సత్యశీలారెడ్డి తెలిపారు. కేఎల్ఐలోని గుడిపల్లి 29వ ప్యాకేజీ ద్వారా మూడ్రోజుల నుంచి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఎత్తిపోతల పథకాలన్నింటినీ ప్రారంభించాం. పథకాల వారీగా ఎంతెంత సాగు చేయాలన్నది శివం మీటింగ్ తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.