నాగర్‌కర్నూల్, మార్చి 28 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతున్నది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతూ వేధింపులకు గురిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు హర్షవర్ధన్, హిమవర్ధన్, లోకేశ్ రూమ్‌కు పిలిపించి యూపీఐ పిన్ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అలాగే ర్యాగింగ్ చేశారని, అందులో భాగంగా గోడ కుర్చీ వేయించారని, లేని సిలిండర్‌ను ఉన్నట్లుగా మోస్తూ చూపించాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం.
ఈ యాక్షన్ మధ్యలో ఆపేస్తే బెల్ట్‌తో సదరు విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు దాడి చేసినట్లు తెలిసింది. ఘటన ఈనెల 24వ తేదీన చోటుచేసుకోగా విషయం తెలిసిన ప్రిన్సిపల్ రమాదేవి కళాశాల ఉన్నతాధికారులతోపాటు, అదనపు ఎస్పీ రామేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాలకు చేరుకున్న ఎస్సై గోవర్ధన్ బాధితుడి నుంచి వివరాలు సేకరించి ర్యాగింగ్ పేరుతో టార్చర్ పెట్టిన ముగ్గురిపై 26వ తేదీన కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్దన్ తెలిపారు.
కాగా కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ర్యాగింగ్ కలకలం రేపిన సంఘటన మొదటిసారని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. ర్యాగింగ్ సంఘటన నిజమని తేలితే సదరు సీనియర్లను హాస్టల్ నుంచి మూడు నెలలపాటు సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు సీనియర్ల తల్లిదండ్రులకూ సమాచారం ఇచ్చినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులతో చర్చించాక చర్యలు తీసుకోనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి పేర్కొన్నారు.