నాగర్కర్నూల్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) ; నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. బడిగంట మోగేందుకు వేళైనా.. పలు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం కోటి ఆశలతో తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్ధమయ్యారు. కానీ సవాళ్ల మధ్య చదువులు సక్రమంగా సాగేనా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన మన ఊరు-మన బడి కార్యక్రమం అటకెక్కగా.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు ముందుకు సాగడం లేదు. దీంతో నాడు కళకళలాడిన బడులు నేడు వసతులు కరువై వెలవెలబోతున్నాయి. దీనికి తోడు బడుల ప్రారంభంలోనే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ తెరపైకి రావడంతో చదువులెలా సాగుతాయేమోనన్న అయోమయం తల్లిదండ్రుల్లో నెలకొన్నది.
2024-25 విద్యా సంవత్సరం బుధవా రం నుంచి ప్రారంభమవుతున్నది. వేసవి సెలవులు ముగిశాక పాఠశాలలు తెరుచుకోనున్నా యి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పం పించేందుకు సిద్ధమయ్యారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందించనున్నారు. ఈక్రమంలో ఈ ఏడాది స్కూల్స్ విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. ఇందుకు ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులే కారణం. ఇప్పటివరకు ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండగా పాఠశాలలు తెరిచే వారం ముందే ప్రారంభం కావడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ బడు ల్లో రోజుకు 90శాతం హాజరు ఉండేలా విద్యాశాఖ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఈక్రమంలో టీచర్ల పదోన్నతులు, బదిలీలపై దృష్టి సారించడంతో పాఠశాలల కు ఆరంభంలోనే ఆటంకాలు కలగనున్నాయి. ప్రభుత్వం చేపట్టిన బడిబాట ఈనెల 6నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు జరగాల్సి ఉండగా.. ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతున్నది. ఉపాధ్యాయులంతా తమకు ఏ స్థానాల్లో పోస్టింగ్ వస్తుందోనన్న ఆందోళనలో ఉంటున్నారు.
ఇక పూర్తిస్థాయిలో పుస్తకాలు, నోటుబుక్కులు మండలాలకు చేరలేదు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలల బడి వేళలు మారగా.. ఉదయం 9గంటలకే ప్రారంభం కానున్నాయి. గ్రామాల నుంచి పూర్తి స్థాయిలో బస్సు రవాణా లేకపోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నది. ఇక ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్ డే అమలు కానున్నది. అ లాగే ప్రతిరోజూ అరగంట పాటు పాఠ్యపుస్తకాల పఠనం, కథల పుస్తకాలు, దినపత్రికలు, మ్యాగజైన్లు చదివించేందుకు నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులకు 2025 జనవరి 10వ తేదీ నాటికి సిలబస్ పూర్తి చేసి రివిజన్ తరగతులు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 వరకు 9వ తరగతి విద్యార్థుల సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయనున్నారు. అలాగే పాఠశాలల్లో యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. కాగా పాఠశాలల్లో సమస్యలు ఎప్పటిలాగే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ‘మనఊరు-మనబడి’ పనుల నిర్వహణ అటకెక్కింది. దీని స్థానంలో తీసుకొచ్చిన ‘అమ్మ ఆదర్శ’ పాఠశాలల పథకం పేరుకు మాత్రమే అమలవుతున్నది. మనఊరు-మనబడి పథకంలో భాగంగా ఎంపిక చేసిన స్కూళ్లల్లో రూ.లక్షలు వెచ్చించి అభివృద్ధి చేయగా.. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రూ.25వేలతో పనులు చేపట్టడం స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. చాలా స్కూళ్లల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు సక్రమం గా లేవు. పలు పాఠశాలలు శిథిలావస్థకు చేరి పెచ్చులూడే దశలో ఉన్నాయి. మొత్తం మీద ఈ విద్యా సం వత్సరం విద్యార్థులకు పలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నది.
వసతులు కల్పిస్తున్నాం..
అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం క ల్పించే పనులు చేపడుతున్నాం. జిల్లాలో 778 ప్రభుత్వ పాఠశాలల్లో 60 వేల మందికిపైగా వి ద్యార్థులు చదువుతున్నారు. బడిబాటను అమలు చేస్తున్నాం. ఉ పాధ్యాయ బదిలీలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. అదేవిధంగా 4.50లక్షల పాఠ్య పు స్తకాలతో పాటు 3.50లక్షల నోట్ బుక్కులను అం దిస్తాం. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్కుల ను, యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకున్నాం.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్