కాల్వలకు సాగునీరు అందించాలి తాళంకేరి గ్రామం మొత్తం సంగంబండ నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైట్ హై లెవెల్ కాల్వను న మ్ముకొని వరి పంట లు సాగు చేస్తున్నారు. కొన్నిరోజుల నుంచి కానాల్లో చుక నీరు రాకపోవడంతో చిరు పొట్టదశలో ఉన్న పంటపొలాలు ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. చివరి క్షణంలో పంట చేతికొస్తుందని, ఆశలు నిరాశలు చేయకుండా సంబంధిత అధికారులు కాల్వల ద్వారా నీరందించేలా చర్యలు తీసుకోవాలి.
– నర్సింహులు, తాళంకేరి, మాగనూరు మండలం
మాగనూరు, మార్చి 13 : మాగనూరు మండలం సంగంబండ రిజర్వాయర్ ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కనిష్ఠానికి పడిపోవడంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాటుకాల్వలు వట్టిపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయకట్టులో వరి పంటలు చిరు పొట్టదశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పంటలు ఎండుతుండడం మరో పక అయితే ఎండలు తీవ్రత కూడా పెరుగుతుండడంతో రైతులను మరింత కలవరపెడుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 364 అడుగులు కాగా.. ప్రస్తుతం నాలుగు అడుగుల కనిష్ఠానికి పడిపోయింది. ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఎండాకాలంలో 19వేల ఎకరాలకు పైగానే వరిసాగు చేశారు. వానకాలంలో అయితే 58వేల ఎకరాల సాగు చేస్తారు. ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభంలోనే ఆయకట్టు చివరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి.
రానున్న మరికొద్ది రోజుల్లో ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరనుండడంతో అన్నదాతలు పంటలు చేతికి అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. అయితే సంగంబండ రిజర్వాయర్ రైట్ హై లెవెల్ కెనాల్ కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు అందక వట్టిపోతున్నది. కాల్వలు వట్టిపోవడంతో పంటలు కూడా ఎండుముఖం పడుతున్నాయని, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు చొరువచూపి సంగంబండ నర్సిరెడ్డి రైట్ హైలెవెల్, లోలెవెల్ కెనాల్‌కు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.