దేవరకద్ర, డిసెంబర్ 31 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కిందట 500 జనాభా కలిగిన పల్లెలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. కొన్ని పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల పాత భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామసభలు ఇతర సమావేశాలు నిర్వహించేందుకు గ్రామపంచాయతీ భవనాలు అనుకూలంగా లేకపోవడంతో అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని హంగులతో పంచాయతీ భవనాలను నిర్మించేందుకు నిధులను మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 139 గ్రామపంచాయతీలకు రూ.20లక్షల చొప్పున కేటాయించింది. పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు కావడంపై ప్రజాప్రతినిధులు, గ్రామీణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ 27.80కోట్లు మంజూరు..
జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, పరిగి, నారాయణపేట నియోజకవర్గాల్లోని 139 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం రూ.27.80కోట్లు మంజూరు చేసింది. మహబూబ్‌నగర్ రూరల్ మండలానికి 6, దేవరకద్రకు 7, అడ్డాకులకు 8, భూత్పూర్కు 11, చిన్నచింతకుంటకు 5, మూసాపేటకు 4, గండీడ్‌కు 17, కోయిలకొండకు 13, హన్వాడకు 14, రాజాపూర్‌కు 6, నవాబ్‌పేటకు 15, మిడ్జిల్‌కు 3, జడ్చర్లకు 16, బాలానగర్‌కు 14 పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులను కేటాయించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామపంచాయతీల రూపురేఖలు మారుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.