అమరచింత, జూన్ 20 : మలిదశ తెలంగాణ ఉద్యమ కళాకారుడు, అమరచింత ముద్దుబిడ్డ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత సాయిచంద్రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా ఈ నెల 29న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ తెలిపారు. శుక్రవారం ఆమె బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగభూషణంగౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లెనిన్, సాయిచంద్ అభిమానులతో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగసభకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం రజినీసాయిచంద్ విలేకరులతో మాట్లాడుతూ సాయిచంద్ రూపం ఉట్టిపడేలా, ఆయన అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా అమరచింత ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రధాన రహదారిపై ఏడడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ విగ్రహాష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభను ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులు, సాయిచంద్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఆమె వెంట సాయిచంద్ అభిమానులు ఉన్నారు.