కొల్లాపూర్, నవంబరు 9 : పేదల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని సైతం కాంగ్రెస్ సర్కారు విషపూరితంగా మారుస్తున్నది. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన పాపానికి ఎలుకలు కొట్టిన, పురుగులు పట్టిన బియ్యాన్ని తినాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లావ్యాప్తంగా రేషన్‌షాపుల నుంచి సూపర్ ఫైన్ రైస్ పేరుతో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని, తినేందుకు పనికి రావడం వాపోతున్నారు.
మిల్లర్లు అధికారులతో కుమ్మక్కు కావడంతోనే రీసైకిల్ బియ్యం గోదాంలకు వస్తున్నాయనే వాదాన ఉండగా, రేషన్ షాప్‌లల్లో నిర్వహణ లోపంతోనే బియ్యంలో పురుగులు వస్తున్నాయనే వాదానలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతమైన కొల్లాపూర్‌లో ఎక్కువగా ముక్కిన బియ్యాన్ని పేదలతోపాటు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో వాడుతున్నారు. ఈ ముక్కిన బియ్యం ప్రతిఫలమే నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనరి పలు హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల పుడ్ పాయిజన్‌కు కారణమని విద్యార్థి, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ముక్కిన బియ్యాన్ని రేషన్ షాప్‌లకు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వనపర్తి జిల్లాలోని అన్నారం గోదాం నుంచి కొల్లాపూర్ ప్రాంతానికి సప్లయ్ అవుతున్న బియ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన పీడీఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ ఫైన్ రైస్ పేరుతో సరఫరా చేస్తున్న సన్నం బియ్యంపై లబ్ధిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నం బియ్యం పేరుతో పేదలకు నాణ్యత లేని బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు కూడా లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా పరిధిలో వెల్దండతోపాటు కొల్లాపూర్ మండలంలోని మొలచింతలపల్లి, రామాపురం, పెద్దకొత్తపల్లి మండలంలోని మారెడుమాన్‌దిన్నె గ్రామాల్లో ముక్కిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేశారు.
రైస్ మిల్లర్ల రాజకీయ పలుకుబడి, అధికారుల చేతివాటం మూలంగానే బియ్యం సరఫరాలో ఉన్న లోపాలు కనబడటం లేదనే విమర్శలు ప్రజా సంఘాల నుంచి వస్తున్నాయి. వనపర్తి జిల్లా ఏరియా మిల్లర్ల పరిధిలోని అన్నారం ప్రధాన గోదాం నుంచి కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి సివిల్ సప్లయ్ గోదాంలకు బియ్యం సరఫరా అవుతున్నాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి గోదాంల నుంచి రేషన్‌షాప్‌లకు వెళ్లిన బియ్యం నాణ్యతపై లబ్ధిదారుల నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి. మిల్లర్ల నుంచి గోదాంలకు బియ్యాన్ని తరలించినప్పుడు పుడ్ కార్పొరేషన్ ఇండియా (ఎఫ్‌సీఐ) తమ సాంకేతిక నిపుణులతో పరీక్షంచడం పరిపాటిగా జరుగుతోంది. కొత్తగా మిల్లింగ్ చేసిన బియ్యం ఆకుపచ్చ రంగులో ఉంటాయని, పసుపు, ఆరంజ్ రంగులో పాత బియ్యం ఉంటాయని నిపుణుల అభిప్రాయం. కానీ మిక్స్డ్ ఇండికేటర్ టెస్ట్ ద్వారా బియ్యం నాణ్యతను గుర్తించవచ్చు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా గ్రామాల్లోకి ముక్కిన బియ్యం సప్లయ్ అయ్యాయంటే లోపం ఎక్కడ జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, ప్రధాన స్టాక్ పాయింట్ల గోదాం నిర్వాహకులు పేర్కొన్నట్లు బియ్యం పంపిణీ, స్టాక్ పాయింట్ నిర్వాహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. జూన్, జూలై, ఆగస్టు నెలల స్టాక్ ఒకే సారి రేషన్ షాప్‌లకి వెళ్లడంతోపాటు పీడీఎస్ బియ్యం కూడా రేషన్షాప్లతోపాటు గోదాంలలో సైతం సంవత్సరాల తరబడి స్టాక్ నిల్వ ఉండటం కూడా బియ్యం ముక్కిపోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మక్కిన పాత బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయడంతోనే సమస్య తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు.
అంతేకాదు స్టాక్ పాయింట్లో పాత బియ్యం కొత్త బియ్యాన్ని వేర్వేరుగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చినా పాటించలేదని అధికారులు తెలుపుతున్నారు. చాలా రేషన్ షాపుల్లో కనీస మొయింటెన్స్ కూడా లేదు. దీంతో రేషన్ షాప్‌లల్లో ఎలుకలు తిన్న బియ్యాన్ని పేదలతోపాటు హాస్టళ్లకు పంపిణీ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం గోదాంలలో స్టాక్ ఉండగా, రేషన్ షాప్‌ల్లో వందలాది టన్నుల పీడీఎస్ బియ్యం స్టాక్ ఉన్నదని అధికారులు తెలిపారు. కొల్లాపూర్ గోదాం నుంచి కొల్లాపూర్, కోడేరు మండలాల పరిధిలోని 58 రేషన్‌షాప్‌లకు 650 టన్నుల బియ్యం సరఫరా జరుగుతోంది. ఇక్కడ పీడీఎస్ బియ్యం 150 క్వింటాళ్ల వరకు స్టాక్ ఉన్నట్లు తెలుస్తోంది.
పెద్దకొత్తపల్లి గోదాం నుంచి పెద్దకొత్తపల్లి మండలంతోపాటు, కోడేరు మండలంలోని తొమ్మిది గ్రామాలకు 3వేల క్వింటాల బియ్యం సరఫరా అవుతున్నాయని, పీడీఎస్ బియ్యం 320 క్వింటాళ్ల వరకు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. బియ్యం నాణ్యతలో నిర్వాహణ లోపం ఎక్కడ జరిగినా దాని ప్రభావం రేషన్ బియ్యంతోనే పూట గడుపుకొనే పేదలపై, ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో చదివే పేద విద్యార్థులపై ఉంటుంది. బియ్యం సరఫరాలో మిల్లర్లు, అధికారులు లాభాపేక్ష చూడకుండా మానవత్వం చూడాలని కోరుతున్నారు. ముక్కిన బియ్యం సరఫరాపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.