మూడుగంటలిస్తే మునుగుడే..
తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్‌కు కండ్లు మండుతున్నాయి. మూడు గంటల కరెంట్ పేరుతో మళ్లీ ఆగం చేయాలని చూస్తుంది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటల్లో నీరు పారించవచ్చని రేవంత్‌రెడ్డి ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
- రైతు బాగుపడుతుంటే కాంగ్రెస్‌కు కండ్లమంట
- రేవంత్ నోట మూడు గంటల కరెంట్ మాట
- 10 హెచ్‌పీ మోటర్లు సరిపోతాయని అబద్ధాలు
- వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించేలా హస్తం యత్నం
- ఓటుతో బుద్ధి చెబుతామంటున్న కర్షకులు
తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్‌కు కండ్లు మండుతున్నాయి. మూడు గంటల కరెంట్ పేరుతో మళ్లీ ఆగం చేయాలని చూస్తుంది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటల్లో నీరు పారించవచ్చని రేవంత్‌రెడ్డి ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించేందుకు హస్తం పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారికి ఓటుతో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)
కరెంట్ కష్టాలు మళ్లీ వద్దు..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పోతుండెనో తెలిసేది కాదు. పంటలు వేయలంటేనే భయపడేవాళ్లం. రాత్రిపూట కరెంట్ కోసం పొలాల వద్ద పడుకునేటోళ్లం. మళ్లా ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని, రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి అంటున్నడు. అసలు వ్యవసాయం గురించి వాళ్లకు ఏం తెలుసు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. మళ్లా కరెంట్ కష్టాలు మొదలై రైతు ఆగమయ్యే ప్రమాదముంది. కాంగ్రెసోళ్లు వద్దు.. వాళ్ల కరెంట్ వద్దు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక కరెంట్ బాధలన్నీ పోయినయ్. పొద్దున పూటనే పొలాలకు నీళ్లు పారించుకుంటున్నాం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాం. రైతులు ఆలోచించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి. 3 గంటలు కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
– ఈశ్వరయ్య, రైతు, మిడ్జిల్
కాంగ్రెసోళ్లను ఎవరూ నమ్మరు..
తెలంగాణ రాక ముందు సమైక్య పాలనలో వ్యవసాయం అస్తవ్యస్తంగా ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడు వస్తదో పోతదో తెలియకపోయేది. కరెంటు కోసం తిండి తిప్పలు మానుకొని పొలం వద్ద పడిగాపులు కాసేవాళ్లం. వచ్చే కరెంటు కూడా లో ఓల్టేజీ ఉండేది. బోరు మోటర్లు నడవక చెడిపోయేవి. కరెంటు కోసం చాలా తిప్పలయ్యేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు 24 గంటల కరెంటు ఇస్తున్నడు. దీంతో పంటకు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు పారించుకుంటున్నాం. పంటలు పుష్కలంగా పండుతున్నాయి. మంచి ధరలొస్తున్నాయి.. గిప్పుడిప్పుడే జర సంతోషంగా ఉన్నాం. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు ఇస్తమంటున్నారు. నాకున్న 10 ఎకరాల పొలానికి మూడు గంటల కరెంటు ఏ మూలకూ సరిపోదు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి ఓట్లు వేస్తే మళ్లీ కరెంటు కోతలే ఉంటాయి. కాంగ్రెసోళ్ల సంగతి రైతులందరికీ ఎరుకనే.. వారిని ఎవరూ నమ్మరు. వ్యవసాయం గురించి తెలిసిన సీఎం కేసీఆర్‌నే మళ్లీ గెలిపించుకోవాలి.. ఉదండాపూర్ రిజర్వాయర్‌ను నింపి చుట్టు పక్కల పొలాలకు సాగునీళ్లు ఇస్తడు. మా గ్రామంలో వ్యవసాయం పండగ అయితది.
– పెద్ద నర్సింహులు, రైతు, చిన్నపల్లి గ్రామం, జడ్చర్ల మండలం
కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మితే ఇగ అంతే..
కాంగ్రెస్సోళ్లు చెబుతున్న మూడు గంటల కరెంట్‌తో ఎవుసం చేయలేం. వాళ్ల మాటలు నమ్మితే భూములు బీడు పెట్టుకోవాల్సిందే. అప్పట్ల వాళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డం. ఎవుసం చేయడమంటేనే భయపడేటట్లు చేసిండ్రు. కరెంటియ్యక, నీళ్లియ్యక నరకం చూపిండ్రు. ఎరువుల కోసం షాపుల కాడ తెల్లవార్లు లైన్ కట్టుకొని నిలబడేవాళ్లం. పోలీసులను పెట్టి కొట్టిపిచ్చిండ్రు. అప్పుసొప్పు చేసి అష్టకష్టాలు పడి పంట పండిస్తే.. సక్కగ కొనేటోళ్లు కూడా ఉండకుండ్రి. ధర కూడా అంతంత మాత్రమే ఇస్తుండ్రి. ఇప్పుడేమో రైతుల బాధలన్నీ పోయినయి. 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. చెరువులు, కుంటలు, కాల్వలు యాడ చూసినా నీళ్లే పారుతున్నాయి. బోర్లళ్ల కూడా నీళ్లు బాగా ఊరుతున్నాయి. ఎరువుల కోసం లైన్ల నిలబడే కష్టమే లేదు. భూమి లెక్క ప్రకారం ఎవ్వరికెన్నీ ఎకరాల్లో అన్నే బస్తాలు ఎప్పుడన్నా తీసుకోవచ్చు. పెట్టుబడి కోసం ఎవ్వరి కాళ్లు మొక్కకుండా సర్కారే రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది. పండించిన పంట దళారుల పాలుకాకుండా కల్లాల్లోనే కాంటాలు పెట్టి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటుంది. ఇంతకంటే రైతులకు ఇంకేం కావాలి. అప్పుడు పట్టించుకోని కాంగ్రెస్సోళ్లు ఇప్పుడు ఎట్లా పట్టించుకుంటారు. మూడు గంటల కరెంట్‌తో మూడు మడ్లు కూడా తడవవు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమంటే ఇప్పటికిప్పుడు ఎట్లా తెచ్చుకుంటాం. అది అయ్యేపని కూడా కాదు. కాల్వ మీద అందరూ అదే పెడితే కరెంట్ ఎంత కాల్తది. లోడ్ ఎంత పడ్తది. లేనిపోని నెత్తినొప్పి కొనితెచ్చుకున్నట్లయితది. కేసీఆర్ పాలనలో రైతులకు గౌరవం పెరిగింది. రైతుల అభివృద్ధి కోసం మంచి పనులు చేసిండు. రైతుబంధుతో రైతులను ఆదుకుండు. రైతుబీమాతో కుటుంబాలకు భరోసా కల్పిచిండు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయమంటే వేయం. మాకు కేసీఆరే బాగున్నాడు.
– కంపిలి మల్లప్ప, రైతు, కోటకదిర, మహబూబ్‌నగర్ రూరల్ మండలం
పొలాల కాడ కాపలా కాయాల్సి వస్తది..
కాంగ్రెసోళ్ల కథ అందరికీ తెలుసు. వీళ్లొస్తే మళ్లీ రాత్రి పూట పొలాల కాడ్నే కాపలా కాయాల్సి వస్తది. నాకున్న నాలుగెకరాల్లో వరి, పత్తి వేసిన. ఇగ కాంగ్రెసోళ్లు చెప్పినట్లు మూడు గంటల కరెంటిస్తే తెగ ఇబ్బందైతది. గిప్పుడిప్పుడే రైతులు కడుపు నిండా బువ్వ తింటున్నరు. హస్తం పార్టీ వాళ్లు వచ్చి మళ్లీ ఆగం చేస్తమంటున్నరు. అయినా, కాంగ్రెసోళ్లు గెలిచేది లేదు. సచ్చేది లేదు. ఫ్రీ కరెంట్ ఇయ్యరు. ఉన్న మోటర్లకు మీటర్లు పెడుతరు. వీళ్లను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. మూడు గంటల కరెంట్‌తో రైతులకు మళ్లీ పాత కరెంట్ కష్టాలు వచ్చినట్లే. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయి, రైతులు చాలా నష్టపోయారు. గతంలో రాత్రి పూట పొలం కాడే పడుకునేటోళ్లు. కాంగ్రెస్ పాలన మాకొద్దు.. కేసీఆర్ సారు ఇస్తున్న 24 గంటల కరెంటు ముద్దు. కాంగ్రెస్ గ్యారెంటీలపై నమ్మకం లేదు. కర్ణాటక రైతులు పడుతున్న బాధలు మాకొద్దు. రేవంత్‌రెడ్డికి రైతులపై అవగాహన లేదు. 10 హెచ్‌పీ మోటర్లు, 3 గంటల కరెంట్‌తో ఎవుసం ఎట్లా చేస్తం. వాళ్లు చెప్పినట్లు పెద్ద మోటర్లు పెడితే ఎంత కరెంట్ బిల్లు వస్తది. ఎట్లా కట్టాలే. మోటర్ కొనడానికి పైసలెవరు ఇస్తరు. గీళ్లు ఎప్పుడైనా ఎవుసం చేసిండ్రా..? 24 గంటల కరెంట్ ఇస్తేనే వీలైన సమయంలో పంటలకు నీరు పెడ్తున్నం. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ల మీద భారం పడదు. సీఎం కేసీఆర్ ఏం చేసినా ఆలోచించే చేస్తరు. కాంగ్రెసోళ్లను నమ్మితే నట్టేట మునుగుడే. వాళ్లు ఢిల్లీ లీడర్లకు గులాంలు. తెలంగాణోళ్లకు ఏడ న్యాయం చేస్తరు. మేం అయితే కేసీఆర్ కే జై కొడుతం. ఆయనుంటేనే పంటలు మంచిగా పండుతయ్. మా కుటుంబం అంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– శశికాంత్‌రెడ్డి, రైతు, పెద్దరేవల్లి గ్రామం, బాలానగర్ మండలం
రైతులు బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తది..
మూడు గంంటల కరెంట్ ఇస్తే నీళ్లు పారవు.. పంట పండదు. అలా అయితే రైతులు బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 7 గంటలు, 6 గంటలు అని చెప్పి రెండు, మూడు గంటలే ఇస్తుండ్రి. దీంతో పంటలు మంచి పండకుండె. తెచ్చిన అప్పులు కట్టేందుకు ఇజ్జత్ కోసం ఉన్న భూములను కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. నాడు రూ.10 వేలకు ఎకరా పొలం అమ్మేవారు. ఇప్పుడా రైతులు అగ్గువకు అమ్ముకున్నామని బాధపడుతున్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత అంతా మంచిగ చేస్తున్నాడు. రైతులు సాగునీళ్లు ఇచ్చి కరెంటు సమస్యలే లేకుండా చేసిండు. అంతేకాక పెట్టుబడికి సాయం అందిస్తున్నాడు. రైతులు ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం కోసం అప్పులు చేయడం లేదు. ఎవరైనా చేసినా బాకీలు కట్టడానికి మాత్రం భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. భూముల ధరలు చాలా పెరిగాయి. నాడు తిప్పలు పడ్డ రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ సార్ వల్లే. మంచి చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తది. చెడగొట్టాలంటే ఒక్క నిమిషం కాదు. మార్పు కావాలని ఓటును పక్కకు వేస్తే తినే అన్నంను కాళ్లతో తన్నినట్లే అయితది. మళ్లీ రైతులు పాత కష్టాలే పడాల్సి వస్తది.
– నాగ్యానాయక్, రైతు తిమ్మాయిపల్లి తండా, అడ్డాకుల మండలం
ఏరికోరి బాధలు తెచ్చుకోవద్దు..
గతంలో నీళ్లు, కరెంట్ లేక చాలా ఇబ్బందులుపడ్డాం. ఆ విషయం అందరికీ తెలుసు. కరువు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్లు వచ్చి ఆదుకోలేదు. తెలంగాణ వచ్చిన తరువాతనే నీళ్లు వచ్చినయ్. రాత్రిపూట పొలాలకు నీరు పారబెట్టుకునేందుకు పోతే ఇంటికి వస్తామో.. రామో.. తెలియని పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్ అనుకున్నది సాధించిండు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు ఇస్తుంటే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఎరువులు అందుబాటులో ఉంచి పంటలకు మద్దతు ధర ఇస్తున్నారు. పచ్చగా ఉన్న గ్రామాల్లో రేవంత్‌రెడ్డి మళ్లీ చిచ్చుపెట్టాలని చూస్తుండు. నిరంతర కరెంట్ ఇవ్వాలన్న సోయి వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదు. మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఏరికోరి మళ్లా ఆ బాధలు తెచ్చుకోవద్దు.
– బొట్టు లక్ష్మణ్‌నాయక్, రైతు, మిడ్జిల్
మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవు..
గతంలో ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన ప్రభుత్వాలు వ్యవసాయానికి 7 గంటల కరెంటిచ్చేవారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు మాత్రమే ఉండేది. అది కూడా సక్రమంగా ఇయ్యకపోయేది. అందుకే కరెంటు వస్తదని చెప్పి పగలు, రాత్రి తేడా లేకుండా బావులు, బోర్ల కాడ ఉంటుంటిమి. కరెంట్ వచ్చిపోతుంటే పారిన మడులే మళ్లీ, మళ్లీ తడిసేవి. అయితే తెలంగాణ వచ్చినంక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మాకు శానా మేలు జరిగింది. ఆయన వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచాడు. 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నడు. ఇప్పుడు మేం పగటిపూట పంటకు నీళ్లు పెట్టుకొని రాత్రి పూట ప్రశాంతంగా ఇంటికాడ పండుకుంటున్నం. నిరంతరం కరెంట్ ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. లో ఓల్టేజీ సమస్య లేనందున ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతలేవు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటిస్తే మళ్లీ రైతు అర్ధెకర, ఎకరా కూడా సాగు చేయలేడు. వీరి అధికారంలోకి వస్తే మాత్రం రైతులు మళ్లీ వలసెళ్లక తప్పదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎన్ని ఎకరాల భూమి పారుతుందో ఆయనకు తెలియదు. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రైతులకు కరెంట్ కష్టాలు తప్పవు. మోసకారి కాంగ్రెస్‌ను తరిమికొడుతాం. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్‌ను నమ్మరు. రైతులంతా బీఆర్ఎస్ వైపే ఉన్నాం. కాంగ్రెస్ కష్టాలు మాకు వద్దు. కేసీఆర్ సర్కారే మాకు ముద్దు..
– రాకేశ్ రెడ్డి, రైతు, కన్మనూర్ గ్రామం, మరికల్ మండలం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

