చిన్నోనిపల్లికి జలగండం పొంచి ఉన్నది. ఊరును వరద చుట్టుముట్టడంతో స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది. వర్షాలు కురుస్తుండడంతో సమీపంలో ఉన్న రిజర్వాయర్‌లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఇప్పటికే ఊరి దరిదాపుల్లోకి జలాలు చేరాయి. దీంతో విషపురుగుల తాకిడి పెరిగింది. మళ్లా భారీ వానలు పడితే ఈసారి ముంపునకు గురికావాల్సిందే..
గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నా.. అక్కడ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో సాగునీటికి ఎలాంటి ఉపయోగం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఏ సమయంలో ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దినదినగండంగా జీవనం సాగిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.
– గట్టు, ఆగస్టు 28
చిన్నోనిపల్లి పరిసరాలకు నీరు చేరింది. తాజా పరిస్థితిని చూస్తే గ్రామానికి జలగండం తప్పదనే పరిస్థితి కనబడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిన్నోనిపల్లి రిజర్వాయర్ సమీపంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఆ నీరంతా రిజర్వాయర్‌లోకి చేరింది. దీంతో నీటిమట్టం పెరిగి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపం వరకు నీళ్లు చేరాయి. ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో గ్రామస్తులు ఉన్నారు. అయితే కనీక సౌకర్యాలు లేకుండా నిర్మించిన పునరావాస కేంద్రంలోకి ఎలా వెళ్లాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు రూపకల్పన చేశారు. ఆంధ్రాకు నీటిని తరలించడానికే ఈ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారనే విమర్శలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. ఏమాత్రం ఆయకట్టు లేని రిజర్వాయర్‌ను ఎందుకు నిర్మించారని నిర్వాసిత రైతులు, ప్రజాసంఘాల నాయకులు గతంలో ఆందోళనలు కూడా చేపట్టారు. తమ ప్రయోజనాల కోసమే ఉమ్మడి ప్రభుత్వం ఈ రిజర్వాయర్‌ను చేపట్టిందనే విమర్శలు ఉన్నాయి.
గతంలో వాగులు ప్రవహించే దగ్గర ఉన్న గండి ద్వారా రిజర్వాయర్ నుంచి నీరు బయటకు వెళ్లేది. అయితే ఆ ప్రాంతంలో గ్యాప్ లేకుండా కట్టను నిర్మించడంతో వరదనీరు రిజర్వాయర్‌లోనే నిలిచిపోతుంది. దీంతో నీటిమట్టం పెరిగి గ్రామం అంచు వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాగా గ్రామస్తులు, నిర్వాసిత రైతుల ఆందోళనలతో అధికారులు దిగొచ్చి రిజర్వాయర్ నుంచి నీరు బయటకు వెళ్లే విధంగా కాల్వ ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కొద్దిపాటి నీరు మాత్రమే అందులోని రిజర్వాయర్ బయటకు పారుతున్నది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటన్నది స్థానికుల అంతుచిక్కడంలేదు.
ముంపు గ్రామం సమీపంలోని ఎర్రగట్టు ప్రాంతంలో పునరావాస కేంద్రం ఏర్పాటు కోసం స్థలాన్ని సేకరించారు. 300 మందిదాకా నిర్వాసిత రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇంకా కొందరికి పట్టాలు అందాల్సి ఉన్నది. రోడ్లు, డ్రైనేజీ, అరకొర తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం అయితే అవసరమైన సౌకర్యాలు కేంద్రంలో ఏర్పాటు కాలేదు. ఈ క్రమంలో తాము అక్కడికి వెళ్లి ఎలా ఉండాలని నిర్వాసిత రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎలాంటి ప్రయోజనాలు లేని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను రద్దుచేసి భూసేకరణ చేసిన పొలాలపై తమకు హక్కులు కల్పించాలని ఆయా గ్రామాల నిర్వాసిత రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతానికి నీటిని తరలించడానికి ఉమ్మడి రాష్ట్ర పాలకులు రూపొందించిన రిజర్వాయర్‌తో దమ్మిడి ఉపయోగం లేదంటున్నారు.
ఈ నిర్మాణం కోసం తాము ఏండ్లుగా పోరాటం చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అదేవిధంగా ఏండ్ల కిందట ఇచ్చిన నష్టపరిహారం కాకుండా తాజాగా ఇప్పటి రిజర్వాయర్ల నిర్మాణాలకు ఇస్తున్న ప్యాకేజీని తమకు అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు సైతం ఇంకా రావాల్సి ఉందని నిర్వాసితులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజీని అందిస్తే తామంతా గ్రామం విడిచిపెట్టి వెళ్తామని నిర్వాసితులు ఖరాఖండిగా చెబుతున్నారు.
ముంపు గ్రామం చిన్నోనిపల్లిలో దినదినగండంలా బతుకుతున్నాం.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఊరిచివరి వరకు రిజర్వాయర్ నీళ్లు చేరాయి. విష పురుగుల భయం ఎక్కువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుని మాకు న్యాయం చేయాలి. పునరావస కేంద్రంలో వసతులు కరువయ్యాయి. ప్యాకేజీ సాయం పెంచి అందించాలి.
– బోయ ఈరన్న, నిర్వాసిత రైతు, చిన్నోనిపల్లి
ముంపు గ్రామాన్ని విడిచి పునరావాస కేంద్రంలోకి వెళ్దామంటే కనీస సౌకర్యాలు లేవు. అందులో నివాసం ఉండలేని పరిస్థితి. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌లోకి వరద వస్తుండడంతో నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఏం చేయాలో పాలుపోవడంలేదు. తమను ఎవరూ పట్టించు కోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
– కుర్వ వీరేశ్, నిర్వాసిత రైతు, చిన్నోనిపల్లి