మక్తల్, ఏప్రిల్ 10 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అధికారులు మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామంలో భూసేకరణ చేపడుతున్నారు. భూసేకరణ ఆపి రైతులను కాపాడాలని కోరుతూ గురువారం కాట్రపల్లి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాట్రేపల్లి రైతులు కేశవ్ మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మక్తల్ మండలంలో చేపట్టిన భూత్పూర్ రిజర్వాయర్ లో కాట్రేపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు 90% కోల్పోయారన్నారు.
మిగిలిన 10% భూములను సైతం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో భూములను కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. మిగిలిన భూమిని తీసుకునేందుకు అధికారులు వేగవంతంగా భూసేకరణ చేస్తున్నారని, ఆ 100 ఎకరాలు ఎత్తిపోతల పథకానికి తీసుకుంటే పూర్తిస్థాయిలో రైతులు నిర్వాసితులుగా మారే అవకాశం ఉందన్నారు. కాట్రేపల్లి గ్రామ రైతుల బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి విన్నవించారు. కార్యక్రమంలో మహేష్, శివరాజ్, జిలానీ, రాజు, రఘు, నర్సింలు, గొల్ల బాలయ్య, గొల్ల కన్నయ్య ఉన్నారు.