అయిజ, అక్టోబర్ 5 : పట్టణానికి సమీపంలోని అయిజ – కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డులోని పెద్దవాగు స్లాబ్ కల్వర్టుపై ఏర్పడిన గండీని పోలీస్, ఆర్అండ్బీ శాఖల సమన్వయంతో తాత్కాలికంగా పూడ్చివేశారు. శనివారం పెద్దవాగు స్లాబ్ కల్వర్టుకు గండి పడిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ‘పెద్దవాగు స్లాబ్ కల్వర్టుకు గండి’ అనే కథనం ప్రచురితం కావడంతో అయిజ ఎస్సై శ్రీనివాసరావు సూచన మేరకు రెండో ఎస్సై తరుణ్‌కుమార్‌రెడ్డి, ఆర్అండ్బీ ఏఈ అల్తాఫ్ పెద్దవాగుకు చేరుకొని గండి పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టారు.
పెద్దవాగు స్లాబ్ కల్వర్టు శిథిలమైనప్పటికీ కొత్త వంతెనకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో హైలెవల్ వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. వానకాలంలో పెద్దవాగు వరద నీటితో పొంగి పొర్లుతుండటంతో స్లాబ్ కల్వర్టు ఏటేటా శిథిలావస్థకు చేరుకుంటుంది. శిథిలమైన స్లాబ్ కల్వర్టు స్థానంలో రూ.8కోట్ల వ్యయంతో హైలెవల్ వంతెన ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు.
ఇప్పటికే పలుమార్లు స్లాబ్ కల్వర్టుకు గండ్లు పడితే అయిజ ఎస్సై శ్రీనివాసరావు ముందుకు వచ్చి రాత్రి వేళల్లో సైతం పోలీస్ సిబ్బంది సహకారంతో గండ్లు పూడ్చి వాహనదారుల ఇబ్బందులను తొలగించారు. ఆదివారం సైతం రెండో ఎస్సై తరుణ్‌కుమార్‌రెడ్డి, పోలీసులు ఉన్నతాధికారుల అనుమతితో స్లాబ్ కల్వర్టుకు కావాల్సిన గ్రావెల్‌ను తరలించగా, ఆర్అండ్బీ అధికారులు గండిని పూడ్చారు. ఎంతకాలం ఈ తిప్పలు పడాలని ప్రయాణికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే శిథిలమైన పెద్దవాగు స్లాబ్ కల్వర్టు స్థానంలో హైలెవల్ వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.8కోట్ల నిధులు వెంటనే విడుదల చేసి, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, అప్పటి వరకు కుంగి, గండ్లు పడుతున్న స్లాబ్ కల్వర్టు స్థానంలో తాత్కాలికంగా డైవర్సన్ వంతెన, రోడ్డు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. గండి పడిన విషయాన్ని ప్రచురించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘నమస్తే తెలంగాణ’కు, గండి పూడ్చేందుకు కృషి చేసిన పోలీసులు, ఆర్అండ్బీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
శాశ్వత పరిష్కారానికి చర్యలు..
పట్టణానికి సమీపంలోని అయిజ – కర్నూల్, అయిజ – రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారిలోని శిథిలావస్థకు చేరుకున్న పెద్దవాగు స్లాబ్ కల్వర్టు స్థానంలో హైలెవల్ వంతెన నిర్మాణం కోసం రూ.8కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు పెద్దవాగుకు ఆనుకొని తాత్కాలికంగా డైవర్సన్ వంతెన ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
-అల్తాఫ్, ఏఈ ఆర్అండ్బీ, అయిజ