మక్తల్ టౌన్, జూలై 24 : పంట సాగు చేసే రైతులు మొదటగా భూసార పరీక్షలు చేయించి తమ భూమి పట్టా పాస్‌పుస్తకం, జాబ్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్‌కార్డుతో పూర్తి వివరాలను పొందుపర్చిన దరఖాస్తును మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అందించాలి. ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు 100శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రభుత్వమే అందిస్తుంది. బీసీలకు 90శాతం రాయితీ మిగతా 10శాతం రైతుల వాటాలో కల్పిస్తుంది. ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసుకునేందుకు మొక్కలతోపాటు ఎరువులు, డ్రిప్‌ను రాయితీతో ప్రభుత్వమే అందిస్తున్నది.
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతుకు లాభాలతోపాటు ఉపయోగాలు కూడా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒకసారి నాటితే 40 ఏండ్ల వరకు ఫలాన్ని ఇస్తుంది. ప్లాంటేషన్ చేసిన రెండేండ్లకు పంట చేతికొస్తుంది. ఎకరంలో పంట సాగు చేసేందుకు రూ.5లక్షల ఖర్చు వస్తుంది. ఒక్కో పండు 250గ్రాములు ఉండటంతో, ఎకరా విస్తీర్ణంలో సాగు చేసిన పంట 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్‌కు కిలోకి రూ.250 పలుకుతుండడంతో 30 క్వింటాళ్ల దిగుబడికి రూ.7.50లక్షల ఆదాయం వస్తుంది. ఈ పంట సాగు చేసిన రైతులకు గ్రామీణాభివృద్ధి శాఖ రూ.2.50లక్షలను రాయితీగా అందజేస్తుంది.
ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు సాగుచేసుకునేందుకు ఉపాధి హామీ, హార్టికల్చర్ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరూ పంట సాగు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతాం.
– ఎంపీడీవో శ్రీధర్, మక్తల్
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు జిల్లాలోని సారవంతమైన నేలలు అనువైనవి. సంప్రదాయ పంటలకు బదులుగా, వాణిజ్య పంట అయిన డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తాం. తెల్లచౌడు, ఇసుక నేలలు ఈ పంట సాగుకు అనువైనవి కావు. రాయితీతో ప్రభుత్వం రైతుకు పంట సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించడం సంతోషకరమైన విషయం.
– జాన్ సుధాకర్, డీఏవో, నారాయణపేట
ధరూర్, జూలై 24 : జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్న నెట్టెంపాడ్ ఎత్తిపోతల రిజర్వాయర్లకు నీటి తరలింపు కొనసాగుతున్నది. గుడ్డెందొడ్డి లిఫ్ట్ నుంచి ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లకు 1,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వరద తగ్గినా నెట్టెంపాడు రిజర్వాయర్లకు నీటిని తరలిస్తున్నారు. సోమవారం జూరాల ప్రాజెక్ట్‌కు 9వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఎగువ నుంచి వరద కొనసాగి రిజర్వాయర్లు నిండితే సాగుకు నీటిని వదలనున్నారు. ఇన్‌ఫ్లో తగ్గితే కాస్త సమయం పట్టవచ్చని ఈఈ రహీముద్దీన్ తెలిపారు.
కొల్లాపూర్, జూలై 24 : కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణానదికి వరద తాకిడి మొదలైంది. సోమవారం ఉదయం నుంచే శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు పెట్టింది. వేసవిలో అడుగంటిపోయిన కృష్ణానదికి ప్రస్తుతం వరద రావడంతో సోమశిల పుష్కరఘాట్ జలకళను సంతరించుకున్నది. ఆదివారం సాయంత్రం వరకు బురదమయంగా ఉన్న నది తెల్లారేసరికి వరదతో కనిపించిందని జాలరి మద్దిలేటి తెలిపాడు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని జాలర్లు చేపలు పట్టేందుకు వెళ్లలేదు. మరబోట్లు, పుట్టీలు సైతం ఒడ్డున తాళ్లతో కట్టేశారు. ఇంతకాలం బోసిపోయి ఉన్న నదికి ఒక్కసారిగా జలకళ రావడంతో ఇక పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నది.
శ్రీశైలం, జూలై 24 : శ్రీశైల జలాశయానికి వరద తాకిడి మెదలైంది. సోమవారం మధ్యాహ్నానికి జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 4,776 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరగా సాయంత్రానికి నీటి నిల్వ 812 అడుగులుగా నమోదైంది. అదేవిధంగా ఏపీ, టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 812 అడుగులు ఉన్నది. నీటిసామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 35.47 టీఎంసీలు ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం తరువాత జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
పెబ్బేరు, జూలై 24 : పెబ్బేరు ప్రాంత రైతుల ఎదురు చూపులకు తెరపడింది. సోమవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమకాలువలో సాగునీరు కంటబడడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. పంటలు వేసే కాలం నెల దాటినా నీటి జాడ లేక ఆందోళన చెందిన రైతన్నలకు.. జూరాల డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో సంబురపడుతున్నారు. ఇప్పటికీ సరైన వర్షాలు లేక ఈ ప్రాంతంలో పంటల సాగు మొదలు కాలేదు. కేవలం జూరాల నీరే జీవనాధారం కావడంతో ఆ నీటి కోసం వేయి కండ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు కాలువ నిండా నీరు ప్రవహిస్తుండటంతో సాగు పనులకు సన్నద్ధమవుతున్నారు.
అమరచింత, జూలై 24 : మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రానికి 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాం సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా భీమా లిఫ్ట్-1కు 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు మొత్తంగా 4,537 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, జూలై 24 : కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు సోమవారం ఇన్‌ఫ్లో 1,14,445 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 6,761 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1,689.44 అడుగులకు చేరింది. 129.72 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 64.41 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 13,675 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 50 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగులు కాగా 1,599.11 అడుగులకు చేరింది. 37.640 టీఎంసీలకు గానూ 19.09 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
టీబీ డ్యాంకు సోమవారం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 213 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.417 టీఎంసీల నిల్వ ఉన్నాయి. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 1,602.84 అడుగులు ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
మదనాపురం, జూలై 24 : మండలంలోని తిర్మలాయపల్లి శివారులో ఉన్న పంప్‌హౌస్‌లో సోమవారం మోటర్లకు పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య హాజరై పూజలు చేసి మోటర్లు ఆన్ చేసి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే సరళాసాగర్ ప్రాజెక్టు ద్వారా పంటలకు పుష్కలంగా నీరు అందుతుందన్నారు. బీడుభూములు సైతం సాగయ్యాయని, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో ఆయకట్టు కింద 4వేల ఎకరాలు సాగవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నీటి తీరువా సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ హనుమాన్‌రావు, సర్పంచ్ రాంనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, మాజీ అధ్యక్షుడు రాములు, నాయకులు పాల్గొన్నారు.