కోయిలకొండ, మార్చి 10 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన స్వయంభూ రామపాద క్షేత్రం శ్రీరామకొండ జనసంద్రంగా మారింది. ఆదివారం అమవాస్యను పురస్కరించుకొని తెలంగాణ నలుమూల నుంచి లక్షలాదిగా భక్తులు రామదర్శనానికి తరలివచ్చారు. తెల్లవారు జామున 2గంటల నుంచే రామదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూలో నిలబడి రామపాదాన్ని దర్శించుకున్నారు. రామకొండలోని మహిమాన్వితమైన కోనేరులో స్నానం ఆచరించి కోనేటి నీటితోపాటు కొండపై ఉన్న వనమూలికలను తమ వెంట తీసుకెళ్లారు. భక్తుల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌లోని నవోదయ ఆసుపత్రి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. స్థానిక ఎస్సై రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సమన్వయ కర్త రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు భీంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.