జడ్చర్ల, ఏప్రిల్ 29 : వేసవిలో కురిసే వర్షాలకు లోతుదుక్కులు దున్నడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. యాసంగి పంటల నూర్పిళ్లు పూర్తి కావడంతో ప్రస్తుతం వ్యవసాయ భూములు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భూముల్లో లోతుదుక్కులు దున్నడం వల్ల గతంలో వేసిన పంటల వ్యర్థాలు వేర్లతోసహా బయటకు వస్తాయి. అలాగే భూముల్లో దాగి ఉన్న శిలీంధ్రాలు, తెగుళ్లకు సంబంధించిన పురుగులు, వాటి లార్వాలు బయటకు వచ్చి చీడపీడల బెడద తప్పుతుంది. యాసంగి పంటకోతల తర్వాత వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూసారం లేకుండా చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలో లోతైన పొరల నుంచి నీరు పైకి పీల్చుకోబడి ఆవిరైపోతుంది. అందుచేత పంట కోసిన వెంటనే తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు దున్నుకోవాలి. సాధారణంగా వేసవిలో అప్పుడప్పుడు కురిసే వానలను రైతులు సద్వినియోగం చేసుకుని మాగాణి, మెట్ట, బీడుభూములను లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. లేకపోతే నేల కోత కు గురై సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. వాలుకు అడ్డంగా దున్నుకుంటే భూమికి తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వేసవి దుక్కులతో భూమిలోపల నుంచి చీడపీడలు బయటపడి ఎండల వేడిమికి చనిపోతాయి. అలాగే వర్షాలు కురిసినప్పుడు నీరు భూమి లోపలికి ఇంకుతుంది. నీటినిల్వ శక్తి పెరుగుతుంది. రైతులు వేసవిలో కురిసే వానలకు దుక్కులు దున్నుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మెళకువలు పాటిస్తే భూసారం
పంటలకు కావాల్సిన వివిధ పోషకాలు సహజసిద్ధంగా కొంతవరకు భూమిలో ఉంటాయి. అయితే ఉన్న మోతాదుస్థాయి, లభ్యతస్థాయి మేరకు పంటకు ఉపయోగపడతాయి. అలాగే పోషకాలు పంటలకు దొరకడం అనేది నేల భౌతిక, రసాయనిక లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్షల వల్ల నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సంప్రదాయకంగా రైతులు భూమి కి బలం పెంచే రకరకాల పద్ధతులు పాటించేవారు. ఈ ఆధునిక కాలంలో అటువంటివి ఆచరించడం తగ్గిపోయింది. గతంలో పశువుల ఎరువు వేయడం, మిశ్రమ పంటలు ఒకే చేనులో పండించడం, జనుము, మినుము, పెసర తరదిర పంటలను సాగుచేసి భూమిలో కలియదున్నడం చేసేవారు. అదేవిధంగా చెరువులో ఉండే ఒండ్రుమట్టిని తెచ్చుకుని పొలంలో వేసుకోవడం, గొర్రెల మందలు, పశువుల మంద లు పొలాల్లో కట్టడం జరిగేది. దాంతోపాటు భూమికి బలం ఇచ్చే కంది, మినుము, గడ్డినువ్వులు తదితర పంటలు వేయ డం, కానుగ, జిల్లెడు, వాయిలిఆకులను తీసుకువచ్చి భూమి లోపలకు తొక్కడం, పంటమార్పిడి పద్ధతి పాటిస్తే భూసారం కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అలాగే పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా మట్టి ఆరోగ్యంగా ఉండేది. ప్రసుత్తం రసాయన పద్ధతులపై రైతులు విపరీతంగా ఆధారపడడం వల్ల భూమిలో ఉండే సూక్ష్మజీవులేకాక అనేక రకాల జీవులు తగ్గిపోయి భూమి రానురాను నిర్జీవం అవుతున్నది. అయితే ఇప్పుడిప్పుడే రైతాంగం మళ్లీ సేంద్రియ వ్యవసాయంవైపు దృష్టి సారించింది. భూసార పరీక్షల వల్ల పొలంలోని పోషక పదార్థాలస్థాయిని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్ష ఫలితాల మేరకు పంటకు ఏ ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడు వాడాలో తెలుసుకోవచ్చు. ప్రతి మూడేండ్లకు ఒకసారి మట్టిని పరీక్షించుకొని భూసారంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎరువులను వినియోగించుకోవడం మంచిది. దీనివల్ల అనవసర ఎరువుల వినియోగాన్ని నిలువరించడమే కాకుండా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. పంటలను చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు అన్నింటికి మించి ఆరోగ్యకరమైన మట్టిని, వ్యవసాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించవచ్చు. నేల ఆరోగ్యం కాపాడుకోవడంతోపాటు సస్యరక్షణలో వేపగింజలను విరివిగా వినియోగించడం మరొక మేలైన అంశం. రసాయన పురుగుమందులకు ప్రత్నామ్నాయంగా రైతులు ముందుచూపుతో వేపగింజలను సేకరించుకొని భద్రపర్చుకుంటే పంటలపై వచ్చే చాలా కీటకాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
లోతుదుక్కులతో రైతులకు లాభం
వానకాలం, యాసంగిలో సాగుచేసిన పంటల కోత అనంతరం ఎం డాకాలంలో కురిసే వర్షాలకు లోతైన దుక్కులు దున్నడం వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. లోతుదుక్కులతో పంటలు వేసే సమయం లో భూమిలోపల దాగి ఉన్న చీడపీడలతోపాటు పంటల వ్యర్థాలు, కోశస్థ దశలో ఉన్న లార్వాలు బయటకు వస్తాయి. భూమి ఎండలకు గుల్లబారిపోయి వానకాలంలో వేసే పంటలకు ఉపయోగకరంగా మారుతుంది. అదీనుగాక కొంతమేర చీడపీడల బెడద తగ్గుతుంది. భూసారంకూడా దెబ్బతినదు. అందుచేత రైతులు వేసవిలో లోతుదుక్కులను దున్నుకోవాలి. అలాగే భూసార పరీక్షలు చేయించుకోవాలి
– గోపీనాథ్, ఏవో, జడ్చర్ల