గద్వాల, మే 7 : ర్యాలంపాడ్ రిజర్వాయర్ మరమ్మతు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. జూరాల ప్రాజెక్టు నుం చి నీటిని తోడి పంటలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడ్ రిజర్వాయర్ చేపట్టారు. రిజర్వాయర్‌కు ఏర్పడ్డ లీకేజీల కారణంగా పూర్తిస్థాయిలో నీటిని నింపుకోలేని పరిస్థితి నెలకొన్నది. జూరాలకు వరదలు వచ్చిన సమయంలో పంపింగ్ ద్వారా రిజర్వాయర్‌ను నింపుతారు. ప్రస్తుతం మరమ్మతులు మరింత ఆలస్యం అవుతుండడంతో ఈ ఏడాది వానకాలంలో కూడా నీటిని పూర్తి స్థాయిలో నింపుకోలేని పరిస్థితి నెలకొన్నది.
ఏప్రిల్ 10వ తేదీన ధరూర్, గట్టు మండలంలోని ర్యాలంపాడ్, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను పూణేకు చెందిన సెంటర్ వాటర్ పవర్ రీసెర్చ్ బృందం రిజర్వాయర్ లీకేజీలు ఎలా అవుతున్నాయి, ఎలా అరికట్టవచ్చనే అం శంపై సంజయ్బూరెల్, సునీల్పిైళ్లె, నర్సయ్య, డాక్టర్ మందిర, డాక్టర్ తనుశ్రీ తదితరుల బృందం ర్యాలంపాడ్, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను పరిశీలించింది. నివేదిక రూ పొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోగా, ప్రస్తుతం మరోసారి పరిశీలించాలని చెప్పడంతో మరమ్మతులు ఆలస్యమయ్యే అవకాశం ఏర్పడింది. ర్యాలంపాడ్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 4టీఎంసీలు కాగా, ప్రస్తుతం లీకేజీల కారణంగా రెండు టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది.
ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి లీకేజీలు..
ర్యాలంపాడ్ రిజర్వాయర్ కరకట్టనుంచే నీళ్లు లీకేజీ అవుతున్నాయని 2019లో అధికారులు గుర్తించారు. అయినప్పటికీ మరమ్మతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజీ పెరిగి కరకట్ట ఉనికికే ప్రమాదం ఏర్పడింది. నీటి లీకేజీల తీవ్రత పెరగడంతో 2021 లో రిటైర్ట్ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్‌ను పరిశీలించింది. రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపితే కట్టకు ప్రమాదమని సామర్థ్యాన్ని 4టీఎంసీల నుంచి 2టీఎంసీలకు తగ్గించారు. అప్పటి నుంచి 2టీఎంసీల నీటినే నింపుతున్నారు.
కేటీదొడ్డి మండలానికి ఈ నీరే ప్రధానం కావడంతో ఆ మండలం చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో ఈ ఏడాది సాగుచేసిన పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయి రైతులు నష్టపోయారు. దీంతో మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలంపాడ్ రిజర్వాయర్ మరమ్మతులపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లికృష్ణారావుతోపాటు ఇరిగేషన్ నిపుణుల బృందం పరిశీలించింది. వీరి పరిశీలన అనంతరం ఇరిగేషన్ సీఈతో పాటు లీకేజీలపై నిపుణల బృందం పరిశీలించాలని కేంద్రానికి లేఖ రాశారు.
మరోసారి రిజర్వాయర్ పరిశీలన..
ఏప్రిల్ 10వ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సెంటర్ వాటర్ పవర్ రీసెర్చ్ కమిటీ వారు రిజర్వాయర్‌ను సందర్శించి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సాయిల్ కండిషన్, నైసర్గిక పరిస్థితులు, రాక్ మెకానిక్స్, సాయిల్ స్టెబిలిటీ, ఎమర్జెన్సీయాక్షన్ప్లాన్ తదితర 5అంశాలపై విచారణ చేశారు. దీనిపై విచారణ చేయాల్సి ఉందని బృందం స్పష్టం చేసింది. దీంతోపాటు సీపేజీని ఎలా అరికట్టవచ్చనే అంశాన్ని పరిశీలించారు. రిజర్వాయర్‌ను పరిశీలించిన పుణె బృందం కట్ట ఎత్తు పెంచడంతోపాటు వెడల్పు చేయాలని సూచించారు. రివిట్మెంట్ పైభాగంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి గ్రౌండింగ్ చేయాలని సూచించారు. ఇందుకు రూ.144 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్లో రిజర్వాయర్ మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
అయితే గతంలో పరిశీలించిన కమిటీ వివరాల నివేదిక ప్రభుత్వానికి ఇవ్వకపోగా, మరింత లోతుగా పరిశీలించాలని, పూర్తి నివేదిక ఇవ్వాలంటే కనీసం 15రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.1.80లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వంతోపాటు ఇరిగేషన్ అధికారులకు ఎస్టీమేషన్ చెప్పడంతో పుణె కమిటీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోక పోవడంతో రిజర్వాయర్ కట్ట మరమ్మత్తుల పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రిజర్వాయర్ లీకేజీల మరమ్మతుకు పుణె కమిటీతో పరిష్కారం దొరుకుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. వారు మరింత లోతుగా స్టడీ చేయాలని చెప్పడంతో మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది.