మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 7 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 110 వినతులు, ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిర్యాదు దారులు తమ సమస్యలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుసూదన్‌నాయక్, జిల్లా అధికారులకు అర్జీల రూపంలో అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
వర్షాకాలంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈనెల 10వ తేదీలోగా వందశాతం గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మండల ప్రత్యేకాధికారులు తనిఖీలు నిర్వహించి నిర్ధేశించిన యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు.
మహబూబ్‌నగర్, జూలై 7 : న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు వెంటనే న్యాయం చేయాలని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఆమె పరిశీలించి సంబంధిత పీఎస్ అధికారులను ఫోన్లో సంప్రదించారు. సమస్యలను వేగంగా, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
నారాయణపేట టౌన్, జూలై 7 : ప్రజావాణిలో అం దించిన ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు మండలంలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేట, జూలై 7 : ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ఆర్జీలను పెండింగ్‌లో ఉంచరాదని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 6 మంది బాధితులు తమ ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదుదారులతో వారి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బద్రూనాయక్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేశ్‌ను మర్యాదపూర్వకగా కలవగా ఆయనకు ఎస్పీ పట్టీలు తొడిగి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్హుల్హక్, ఆర్ఐ నర్సింహ పాల్గొన్నారు.