వనపర్తి, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గ్రామసభలు శుక్రవారం ప్రజల రసాభాసల మధ్య ముగిశాయి. చివరి రోజు మొత్తం 16 గ్రామసభలకు గానూ గోపాల్‌పేటలో రెండు, పాన్గల్లో రెండు, వనపర్తిలో మూడు గ్రామాల్లో జరుగగా, ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండు వార్డులు, కొత్తకోటలో ఐదు, పెబ్బేరులో రెండు వార్డుల్లో సభలు నిర్వహించారు. నాలుగు రోజులపాటు సభల్లో ప్రజలు సమస్యలు లేవనెత్తడంతో అధికారులు మమ అనిపించారు.
ప్రతిచోటా పోలీసులను పెట్టి సభల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నచిన్న గ్రామాల్లో సమస్యలు అంతగా ఉత్పన్నం కానప్పటికీ పెద్ద గ్రామాల్లో సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. ఏడాది నుంచి సంక్షేమ పథకాలకు ఎదురు చూస్తున్న ప్రజలకు అరకొర లిస్టులతో గ్రామసభల్లో ప్రదర్శన చేస్తుండడంతో పుండుపై కారం చల్లినైట్లెంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో చాలా మంది నిరుపేదలు, అర్హుల పేర్లు జాబితాల్లో లేకపోవడంతో గందరగోళాల మధ్య గ్రామ సభలను ముగించారు. నాలుగు రోజుల పాటు జిల్లాలో 348 సభలను కొనసాగించారు.
వనపర్తి మండలంలోని పెద్దగూడెంలో జరిగిన గ్రామసభ రసాభాస అయింది. గ్రామకూడలిలోని ఆంజనేయస్వామి గుడి వరండాలో గ్రామసభ ఏర్పాటు చేయగా, జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. అధికారులు గ్రామంలో ఇండ్ల జాబితాలో వచ్చిన వారి పేర్లు చదువుతుండగానే ఒక్కసారిగా అధికారులపైకి తిరగబడ్డారు.
లిస్టుల్లో తమ పేర్లు ఎందుకు లేవని, ఎందుకు ఈ సభలు పెట్టారని, నిరుపేదలకు ఇస్తామని కేవలం ఒకపార్టీకి చెందిన వారి పేర్లు చదవడం వల్ల గందరగోళం చెలరేగింది. ఎలాంటి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం నుంచి లబ్ధిచేకూరడం లేదని గ్రామానికి చెందిన మహిళ అధికారులను నిలదీసింది. పట్టుమని పది నిమిషాలు కూడా సభ ముందుకు సాగలేదు. జనం లేవనెత్తిన సమస్యలతో అక్కడికి వచ్చిన అధికారులు సమాధానాలు చెప్పలేక వెనుదిరిగారు.