ఊట్కూర్ : బీజేపీ(BJP) , ఆర్ఎస్ఎస్ ( RSS ) మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ( Prajapantha Mass Line ) పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన దినం (Protest day) పాటించాలని మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు గవినోల్ల వెంకట్ రెడ్డి ( Venkatreddy ) , సిద్దు ( Siddu) పిలుపునిచ్చారు.
మాస్ లైన్ పార్టీ ప్రజాపంథా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడవసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోర వైఫల్యం చెందిందన్నారు.
దేశంలో కార్మిక వర్గం ఉద్యోగ భద్రత, వేతనాల కోసం ఉద్యమిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రైతులు ఎంఎస్ పీ, గిట్టుబాటు ధరల హామీ, ఋణ రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారని, సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు, భూమి లేని పేద రైతులు భూమికోసం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం యువత పోరాటాలు చేస్తుంటే కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఏప్రిల్ 8న జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు, యువకులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ మండల కార్యదర్శి కే మల్లేష్, గ్రామ నాయకులు జి. గోవర్ధన్ రెడ్డి, కతలప్ప, అంజు, రాజు పాల్గొన్నారు.