నాగర్కర్నూల్, నవంబర్ 6 : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 అక్టోబర్లో గత ప్రభుత్వం జీవో 51 విడుదల చేసి సిబ్బంది వేతనాలను రూ.8,500 పెంచిందన్నారు. పెంచిన వేతనాలు అందించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మంది జనాభాకు ఒక కార్మికుడి చొప్పున 36,500 మందిని ఖరారు చేసి ఆన్లైన్లో వారి పేర్లను పొందుపర్చాలన్నారు. గడిచిన 15 ఏండ్ల కాలంలో గ్రామ పంచాయతీల విస్తీర్ణంతోపాటు గ్రామాల్లో ప్రజల సంఖ్య పెరిగిందన్నారు.
దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అవసరాలు కూడా పెరగడంతో అదనంగా సుమారు 13,500 మంది కార్మికులను అనేక పంచాయతీల్లో నియమించి వారిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వేతనాల చెల్లింపులోనూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ ఎలాంటి గుర్తింపునకు నోచుకోకపోతున్నారన్నారు. పంచాయతీల అవసర ప్రాతిపదికన అదనపు కార్మికులను నియమించి వారికి చెల్లించే వేతనాలు చెల్లించకుండా పాత కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలను అదనపు కార్మికులకు కలిసి పంచి ఇవ్వడం వల్ల ప్రతినెలా రూ.9,500 అందుకోవాల్సి కార్మికులకు ఈ విధానంతో మూ డు, నాలుగు వేలు మాత్రమే అందుతున్నాయన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, జీవో 51 సవరణ నుంచి మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, పంచాయతీ కార్మికుల వేతనాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరవధిక సమ్మెకు పూనుకుంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవోకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య, జిల్లా కోశాధికారి కొంపల్లి అశోక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశన్న, యూనియన్ నాయకులు ఉన్నారు.