పేదల కళ్లల్లో వెలుగులు నింపే పథకం కంటి వెలుగు. అవగాహన లేమితో దృష్టి లోపానికి గురవుతున్న ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, అద్దాలు అందించే రెండో విడుతకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 18వ తేదీ నుంచి ప్రారంభించి జూన్ 30వ తేదీ వరకు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తున్నది. గ్రామపంచాయతీల్లో, పీహెచ్‌సీల్లో వంద రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించ నున్నది. ఉమ్మడి జిల్లాలో 38 లక్షల మందికి ‘ఐ’ పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నది. పరీక్షలు చేసి కంటి సమస్యలు ఉన్న వారికి వైద్యులు వెంటనే రీడింగ్ గ్లాసెస్ అందించనున్నారు.
నాగర్‌కర్నూల్, జనవరి 6(నమస్తే తెలంగాణ): రెండో విడుత కంటివెలుగు అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 18వ తేదీనుంచి కంటి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడంతో వైద్యారోగ్యశాఖ సన్నద్ధం కానున్నది. 2018, ఆగస్టు 15న తొలి విడుతలో భాగంగా కంటివెలుగు పథకం నిర్వహించారు. ఇలా మూడేండ్ల తర్వాత ఈ నెల 18నుంచి జూన్ 30వ తేదీ వరకు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ప్రభుత్వం 100రోజుల పనిదినాల్లో ఊరూరా కంటివెలుగు నిర్వహించనున్నది. ప్రభుత్వ వైద్యశాఖ అంచనా మేరకు జనాభాలో 25శాతం మంది కంటి సంబంధిత అనారోగ్యాలతో బా ధపడుతున్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే పరిస్థితు లు వస్తున్నాయి.
పరీక్షలు, చికిత్స స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో పేదలు ఆసక్తి చూపడం లేదు. దీ న్ని గుర్తించిన ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమం ద్వా రా ప్రజలకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు మరోసారి చర్యలు తీసుకోనున్నది. ఇందులో భాగంగా ఆఫ్తాలమిస్ట్ వైద్యులను నియమించారు. అదేవిధంగా డాక్టర్ ఆధ్వర్యంలో ఆఫ్తామెట్రిస్ట్, సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌తో కూడిన బృందాలు గ్రామాలు, మున్సిపాలిటీల్లో కంటి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. 100రోజులపాటు వంద శాతం మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారంలో ఐదు రోజుల పాటు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కంటి పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు రోజుకూ రూ.వెయ్యి, సిబ్బంది భోజనాలకు రూ.1500చొప్పున ప్రభుత్వం కేటాయించనున్నది. ప్రతిరోజూ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించి ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో ప్రజలకు ముందుగానే సమాచారం అందించడం జరుగుతుంది. పంచాయతీ కార్యాలయాలు, పీహెచ్‌సీల్లో కంటి పరీక్షలు జరుగుతాయి. రేషన్ దుకాణాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంపులు నిర్వహించే తేదీలను అందరికీ తెలిసేలా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 12వ తేదీవరకు మంత్రి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు పూర్తవుతాయి. కాగా, పరీక్షల వివరాలను అదే రోజు సాయంత్రం ఆన్లైన్లో నివేదించడం జరుగుతుంది. కంటి పరీక్షలు నిర్వహించాక దగ్గర చూపు సమస్య ఉన్న ప్రజలకు అక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమైన వారికి 15రోజుల తర్వాత ఏఎన్ఎంలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఇందులో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములు కానున్నారు. దీంతో ఉచితంగానే పేదలకు కంటి చికిత్స, అద్దాలు లభించనున్నాయి.
దీనికోసం మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోనున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పాలమూరులో 35లక్షల మంది జనాభా ఉన్నట్లు అంచనా. అయితే ఈ 11ఏండ్లలో మూడు లక్షల మంది జనాభా పెరిగినట్లుగా అంచనా. ఈ మేరకు ఐదు జిల్లాల్లో 19.15లక్షల మంది మహిళలు, 19.52లక్షల మంది ఫురుషులు కలిపి 38,68,245మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 547గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో 97వేల మంది జనాభా ప్రాతిపదికన 100రోజులపాటు కంటి పరీక్షల నిర్వహణకు 50బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇందులో భాగంగా 73,596రీడింగ్ అద్దాలు రానున్నాయి. పేదలకు కంటి సంబంధిత అనారోగ్యాలను దూరం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అమలుకు కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.
రెండో విడుత కంటి వెలుగును ఈ నెల 18వ తేదీనుంచి నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొలి విడుతలో జిల్లాలో 5లక్షల మందికిపైగా ప్రజలకు కంటి పరీక్షలు చేసి 53వేల మందికి కళ్లద్దాలను అందజేశాం. జిల్లాలో జిల్లాలోని 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 50బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో 9మంది చొప్పున 400మంది వైద్య సిబ్బందిని కంటి పరీక్షల కోసం నియమించడం జరిగింది.
– సుధాకర్లాల్, డీఎంహెచ్‌వో, నాగర్‌కర్నూల్ జిల్లా