అచ్చంపేట : మండలంలోని నడింపల్లి గ్రామ శివారులో ఈనెల 15న బోరం వీరయ్యను హత్య ( Murder ) చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు ( ASP Rameshwar Rao ) తెలిపారు. శనివారం అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ వివరాలను వెల్లడించారు.
నడింపల్లికి చెందిన సుగూరు మహేష్, పదిర శివ, ఎడ్ల మహేష్ ముగ్గురు కలిసి వీరయ్యను హత్య చేశారని తెలిపారు. వీరయ్య, కొడుకు వెంకటేష్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో దారి కాచి గొడ్డలి, సుత్తి తో బలంగా దాడి చేయడంతో వీరయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
గత నెల 15న వీరయ్య కొడుకు వెంకటేష్ సుగూరు మహేష్ భార్యను బలవంతంగా గుంటూరు ప్రాంతానికి తీసుకెళ్లి ఉంచుకోవడంతో మహేష్ కుటుంబ సభ్యులు కోపంతో తండ్రి, కొడుకులపై దాడి చేశారన్నారు. వెంకటేష్ తన భార్యకు సంబంధించిన ఫోటోలు స్టేటస్‌లో పెట్టుకోవడం వల్ల అందుకు ప్రతీకారంగా అతని తండ్రిని టార్గెట్ చేశారని వెల్లడించారు.
ముగ్గురు నిందితులపై గతంలో నేరచరిత్ర ఉండటం వల్ల రౌడీ షీట్ కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సీఐ రవీందర్, సిబ్బంది పనితీరును అడిషనల్ ఎస్పీ అభినందించారు.