మహబూబ్‌నగర్, జూన్ 20 : ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఇటీవల అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో సంకెళ్లు వేసిన ఘటన చాలా దురదృష్టకరం అని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కానివ్వమని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఆయన జోగుళాంబ జోన్ పరిధిలోని ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీల ఎస్కార్ట్ విధుల్లో నిర్వహణ, భద్రతా చర్యలు జైలు, కోర్టుల మధ్య సమన్వయం, అనుమానాస్పద కార్యకలాపాల పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహంచారు.
అనంతరం ఐజీ విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ భారతీయ న్యాయస్థానం ప్రకారం ఖైదీల ఎస్కార్టులు, శిక్ష పడిన నేరస్తులు వారు దవాఖానకు వెళ్లేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్పీలకు సమాచారం వస్తుందని, నేరస్తుని ప్రవర్తనలో, పాత నేరస్తుడు అనే విషయంలో సమాచారం పొందుపరుస్తూ ఎటువంటి సమన్వయం లోపం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవల అలంపూర్ కోర్టులో, సంగారెడ్డిలో జరిగినా ఘటనలు చాలా దురదృష్టకరమైన విషయాలు అని, ఇటువంటి సమన్వయ, సమాచారం లోపం లేకుండా ఉండేందుకు ఎస్పీ, జిల్లా స్థాయిలో ఎస్వోపీ తయారు చేయడం జరిగిందన్నారు. ఒకసారి రిమాండ్ చేసిన ఖైదీలను తర్వాత బెయిల్ కోసం, దవాఖానకు వెళ్లేటప్పుడు లా అండ్ ఆర్డర్ వారిపై నిఘా తక్కువ పెట్టడం జరుగుతుందనన్నారు. రైతులు, మహిళలు, మైనర్లు, వృద్ధ్దులను తరలించే విషయంలో అవసరం మేరకు జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక వేళ ఎవరికైనా సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే న్యాయస్థానం అనుమతితో కానీ, బీఎన్ఎస్ 43 సెక్షన్ ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
అలంపూర్ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం, ఏదైనా జరిగితే ఎదో అవుతుందనే అభద్రత భావనతో పోలీసులు జాగ్రత్తలు పాటించి సస్పెండ్‌కు గురైనట్టు వివరించారు. సమావేశంలో మహబూబ్‌నగర్ ఎస్పీ డీ జానకి, నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ తోట శ్రీనివాస్‌రావు, నారాయణపేట ఎస్పీ యోగేష్‌గౌతం తదితరులు పాల్గొన్నారు.