కొల్లాపూర్, మార్చి 12 : పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలలోని హాస్టల్స్‌ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆ కళాశాలలో విద్యార్థులు మంగళవారం నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా పీయూ జేఏసీ చైర్మన్ బత్తిని రాము, బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు శేఖర్, స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు దాస్ మాట్లాడుతూ పీజీ కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు హాస్టల్లో వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి అడ్మిషన్ పొంది ఉన్నత విద్యతో కూడిన పట్టాలు తీసుకుపోవాలని ఎన్నో ఆశలతో విద్యార్థులు ఇక్కడికి వచ్చారన్నారు. కానీ వారు నేడు అర్ధాకలితో అలమటిస్తున్నారని, మెస్ ప్రారంభం చేయకపోవడం మూలంగా రూ మ్స్‌లో విద్యార్థులు వంట చేసుకొని తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ, ఎస్ఎస్ యూ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.