నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : నల్లమలకు వైరల్ ఫీవర్ పట్టుకున్నది. వానకాలం రావడంతో చాలా మంది వైరల్ ఫీవర్‌తో దవాఖానలకు ప రుగులు పెడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలున్నా చా లా మంది ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ మొబైల్ అంబులెన్స్ సేవలు ఉన్నా వారికి నమ్మకం కలిగించడం లేదు. మూడు నెలల ముందు నుంచే అటవీ ప్రాంతాల్లోని ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు.
వేధిస్తున్న రక్తహీనత
ఏజెన్సీల్లోని చెంచులను రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పోషకాహారం లేక బలహీనంగా మారుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పటి వరకు ఉన్న కిట్లను పంపిణీ చేసిందే తప్పా కొత్తగా అందించలేదు. ఇది చెంచుల్లో పౌష్టికాహార లోపాన్ని పెంచుతున్నది. ఇక ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు ని ర్వహించి ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతోంది.
ఇక్కడి ప్రజలకు స్థానికంగానే పరీక్షల ఫలితాలు అందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.90లక్షలతో నిర్మించి, నాటి మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చేతుల మీదుగా ప్రారంభించిన టీ హబ్ నిరుపయోగంగా మా రింది. ప్రారంభానికే పరిమితం కావడంతో వైద్య పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి రక్త, మూత్ర, ఇతర పరీక్ష ల శాంపిళ్లను పంపించి, ఫ లితాలు వచ్చేలోపు రోజు లు పడుతోంది. అప్పటి వ రకు ప్రజలకు అనారోగ్య సమస్య తీవ్రత పెరుగుతోంది. మన్ననూర్లోని ప్రభుత్వ వైద్యశాలలో సిం గిల్ డిజిట్‌లోనే ప్రజలు చికిత్సలు తీసుకుంటుండ గా అదే అక్కడి స్వచ్ఛంద సంస్థలు ఆర్డీటీ, అపో లో దవాఖానల వద్ద మా త్రం బారులు తీరారు. ఇక్కడి వైద్యశాలతో పోలిస్తే స్వ చ్ఛంద సంస్థల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చికిత్సకు మొగ్గుచూపుతున్నారు.
చాలా మంది ఇన్ పేషెంట్లుగా చికిత్సలు తీసుకుంటున్నారు. సరైన వసతులు లేకున్నా ఆరుబయటే పడుకొని చికిత్సల కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఇచ్చే వైద్యం, మం దులపై ఇక్కడి ప్రజలు నమ్మకం కోల్పోవడం వల్లే ఇలా ప్రైవేట్ వైపునకు పరుగులు పెడుతున్నారు. కొద్దిగా డ బ్బులు ఖర్చయినా సరే.. ఆరోగ్యం బాగుపడితే చాలని అంటుండడం ప్రభుత్వ దవాఖానలపై అపనమ్మకాన్ని చాటుతోంది. ప్రభుత్వం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పించడంతోపాటు అవసరమైన మందులు అందించాల్సి ఉన్నది.
ఏజెన్సీలో హడల్
నాగర్‌కర్నూల్ జిల్లాలో వైరల్ ఫీవర్ బెంబేలెత్తిస్తోంది. వర్షాకాలం కావడంతో ఏజెన్సీ ఏరియాలో ని చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. జిల్లాలోని అమ్రాబాద్, పదర, లింగాల తదితర ప్రాంతాల్లోని ఏజెన్సీ ఏరియా ప్రజలకు సీజనల్‌గా వ్యాపించే వైరల్ ఫీవర్ ప్రభావం చూపుతోంది. చా లామంది చలి, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసానికి గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతుండడంతో అటవీ ప్రాంతాల్లో సహజంగా విషజ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
అయితే, డెంగీ, మలేరియా కేసులు మాత్రం నమో దు కాకపోవడం గమనార్హం. కాగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందిస్తున్నా చాలా మంది ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రులకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. మూడు మొబైల్ అంబులెన్స్‌లు రోజూ రెండు చెంచు పెంటల్లో సేవలు అందిస్తున్నాయి.
అయితే ఆయా దవాఖానల్లో అందించే సేవలపై ప్రజలకు నమ్మకం కలగడం లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం, ఇటీవల ప్రత్యేకాధికారులు బదిలీ కావడంతో పల్లెల్లో పారిశుధ్యం, పాలన పూర్తిగా అటకెక్కింది. దీనివల్ల అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నా రు.
ఈ కారణంగా సాధారణ గ్రామాలు, పట్టణాల్లో నే వైరల్ ఫీవర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చే స్తుండటం విశేషం. ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ఏజెన్సీ పరిధిలోని లింగాల, అమ్రాబాద్, వటువర్లపల్లి, పదర, ఈగలపెంట, దోమలపెంట, మన్ననూర్, తదితర దవాఖానల్లో రోజూ 60 నుంచి 80 మంది చొప్పున ప్ర జలు ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటున్నారు. ఇలా ఏజెన్సీ పరిధిలో రోజూ 300 నుంచి 400 మంది వరకు దవాఖానలకు వస్తున్నారు.
వైద్య సేవలందిస్తున్నాం..
ప్రభుత్వ దవాఖానలో రో జూ చికిత్సలు, మందులు ఇ స్తున్నాం. అవసరమైతే గ్లూకోజ్‌లు కూడా ఎక్కిస్తున్నాం. రోజూ మూడు అంబులెన్స్‌లు చెంచు పెంటల్లో తిరుగుతున్నాయి. తొందరగా తగ్గుతుందనే అపనమ్మకంతో బయట దవాఖానలకు వెళ్తున్నారు. ఈసారి వైరల్ ఫీవర్లతోనే ఎక్కువగా ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు.
– డాక్టర్ గౌతమ్, మన్ననూర్ పీహెచ్సీ