అమరచింత : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీల బకాయిలను ( Pending Bills ) చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎంపీడీవో కార్యాలయం ( MPDO ) ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్, మండల అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కనీస సౌకర్యాలను కల్పించడం లేదని ఆరోపించారు. పని ప్రదేశంలో తాగడానికి నీళ్లు లేక, సేద తీరేందుకు టెంట్ సౌకర్యం లేక కూలీలు ఎండలోనే మండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూలి డబ్బులు చెల్లించకపోవడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఉద్యోగులకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.