మద్దూర్, నవంబర్ 7 : మా గ్రామాన్ని బల్దియాలో విలీనం చేయొద్దని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ‘పురపాలిక వద్దు.. పంచాయతే ముద్దు’ అంటూ గురువారం రెనివట్ల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అభివృద్ధి మాటున తమ గ్రామాన్ని మద్దూర్ మున్సిపాలిటీలో కలపొద్దన్నారు. ఆ పూటకాపూట సంపాధించుకొని కాలం వెల్లదీస్తున్నామని, ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం చేస్తే తమ బతుకులు ఆగమవుతాయన్నారు.
పన్నులు, నల్లాబిల్లులంటూ తమ నడ్డీ విరిచే ప్రయత్నం చేస్తున్నదంటూ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఇంటి పర్మీషన్ కావాలన్నా.. ఏ చిన్న పని కోసమైనా పనులన్నీ వదులుకొని మున్సిపాలిటీకి వెళ్లాల్సి వస్తుందన్నారు. తమ బతుకులు బాగుపడాలంటూ గ్రామపంచాయతీగానే ఉండాలని కోరారు. అనంతరం కాడాధికారి వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
రెనివట్ల ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఉండడం వల్ల కనీసం ఉపాధి పనులు అయినా చేసుకొని బతుకుతున్నాం. మున్సిపాలిటీలో విలీనం చేస్తే గ్రామంలో ఉపాధి పనులు కూడా ఉండవు. ఇక మేము కష్టం చేసిన డబ్బులన్నీ పన్నులు కట్టడానికే సరిపోతుంది. దీంతో జీవించడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే మా గ్రామాన్ని ఎక్కడా కలుపొద్దు గ్రామ పంచాయతీగానే ఉంచాలి.
– నర్సింహులు, రైతు, రెనివట్ల, మద్దూర్ మండలం
ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మున్సిపాలిటీ ఏర్పాటుతో మరింత ఇబ్బందులు ఏర్పడతాయి. బ్యాంక్ లోన్లు కూడా సరిగా ఇవ్వరు. ఇప్పుడు ఏ పనికైనా పంచాయతీ దగ్గరకు పోతున్నాం. మున్సిపాలిటీగా ఏర్పడితే మద్దూరుకు పోయి పనులు చేసుకోవాలా, మాకు రేనివట్ల గ్రామ పంచాయతీగానే ఉండాలి.
– సండ్రుక మంజుల, రెనివట్ల, మద్దూర్ మండలం
రేనివట్ల గ్రామ పంచాయతీగా ఉంటేనే ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. మున్సిపాలిటీగా ఏర్పడితే మా గ్రామం వార్డుగా మారి అభివృద్ధి పూర్తిగా కుంటుబడడం ఖాయం. ప్రస్తుతం కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులే జరగడం లేదు. అలాంటి పరిస్థితే ఏర్పడుతుంది.
– భవానీశంకర్, మాజీ సర్పంచ్, రెనివట్ల, మద్దూర్ మండలం
గ్రామంలో ఉపాధిలేక ఇప్పటికే వలస పోతున్నాం. మద్దూర్ మున్సిపాలిటీలో రెనివట్ల గ్రామ పంచాయతీ విలీనం చెస్తే మేము చేసే కష్టం మొత్తం పన్నులకే సరిపోతుంది. మేం ఎట్లా బతకాలి, ఇక నుంచి ఇండ్లు కట్టుకోవడం కూడా కష్టంగా మారే పరిస్థితి ఉంటుంది.
– కరణ్, రెనివట్ల గ్రామం, మద్దూర్ మండలం