నాగర్‌కర్నూల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) ;‘కలలు కనండి.. సాధించండి’.. అనేది దివంగత రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం మాటలు. ఆ మాటలను అచ్చం పుణికిపుచ్చుకున్నాడో పాలమూరు పల్లెకు చెందిన గంగనమోని శేఖర్. కష్టాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆ కష్టాలను ఇష్టాలుగా మలుచుకొని సినీరంగంలో ఎదగాలనే తన ఆకాంక్షకు పట్టుదలను జోడించి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ స్థాయి నుంచి దర్శకత్వ స్థాయికి ఎదిగి జిల్లా ప్రతిభను చాటుతున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్గొండకు చెందిన శేఖర్ ‘సర్కార్ నౌకరి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రముఖ హీరో చిరంజీవి, దర్శకుడు కే.రాఘవేంద్రరావుతో పాటుగా పలు సినీ దిగ్గజాల ప్రశంసలను పొందుతున్నారు. ఇక అదే వెండి తెరలో పాలమూరు అందాలను ప్రపంచం ముందుకు తీసుకొస్తున్న శేఖర్ సినీ ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
నాడు పాలమూరు ప్రజలు, ముఖ్యంగా యువత అంటే పొట్టకూటి కోసం వలస వెళ్లే కూలీలుగా పేరుండేది. తెలంగాణ రాష్ట్ర సాధనతో ఇప్పుడు ఆ పరిస్థితులు కనుమరుగయ్యాయి. రాష్ట్రంలో శివారున నల్లమల ప్రాంతంలోని యువత క్రీడా, సాంస్కృతిక, సాహిత్య, ఇతర రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ పాలమూరు ఖ్యాతిని చాటుతున్నారు. ఇదే క్రమంలో సినీ రంగంలోనూ ఇప్పటికే పలువురు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇదే కోవలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం వెల్గొండకు చెందిన గంగనమోని శేఖర్ తన సినీ ప్రయాణాన్ని అద్భుతంగా ముందుకు సాగిస్తున్నారు. బిజినేపల్లి మండలం వెల్గొండలో చిన్న రైతులైన చంద్రయ్య, చంద్రమ్మ ఐదుగురి సంతానంలో శేఖర్ ఒకరు. సొంతూరులో 2004 వరకు పదో తరగతి, 2004-2006 నుంచి ఇంటర్ నాగర్‌కర్నూల్‌లో చదివారు. శేఖర్‌కు సినిమాలో పేరు తెచ్చుకోవాలన్న ఆసక్తి.. కష్టపడేతత్వం తప్పా ఇండస్ట్రీపై అవగాహన లేదు. పూర్తి గా కొత్త. పాలమూరు నుంచి వచ్చిన వాళ్లంటే సినీ ఇండస్ట్రీలో మరింత చిన్నచూపు. అలాంటి తరుణంలో శేఖర్ తన ప్రతిభను నమ్ముకొన్నారు. అతడి సోదరుడు గురుముర్తి సహకారంతో జేఎన్టీయూలో బీఎఫ్ఏ ఫొటోగ్రఫీలో చేరి ఫోటోగ్రఫీపై పట్టుసాధించారు. సినిమాటోగ్రాఫర్ అధ్యక్షుడిగా, ఇప్పటికే సినీరంగంలో మంచి పేరు తెచ్చుకొన్న బిజినేపల్లి మండలం పాలెంకు చెందిన పీజీ విందాతో ఫొటోగ్రఫీ గురించి మరింత అవగాహన తెచ్చుకొన్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రస్థాయి అవార్డులను సాధించారు. ఇలా రాజేంద్రప్రసాద్ నటించిన ‘అయ్యారే’ సినిమాకు సర్వేశ్ మురారీ దగ్గర తొలిసారిగా అసిస్టెంట్‌గా, అప్రెంటీస్‌లో చేరారు. తర్వాత ఆపరేటింగ్ కెమెరామెన్‌గా చేశారు. ఇలా రగడ, నిప్పు, యాక్షన్ త్రీడీ, దూసుకెళ్తా, పటాస్, షేర్, దేశంలో దొంగలు పడ్డారుతోపాటు తమిళ పటాస్‌లాంటి 12 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్‌గా పని చేశారు. కాగా నాట్యం సినిమాకు చేయడంతో మరింత గుర్తింపు లభించింది. అదే విధంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్‌గా మూడేళ్లు పని చేశారు.
దర్శకత్వమే లక్ష్యంగా..
సినిమా రంగంలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేస్తూ మరింత స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష రోజూ తొలచివేసేది. తనకు తొలుత రచనపై ఆసక్తి. ఆ తర్వాత తుది లక్ష్యం దర్శకత్వం. ఇలా అసిస్టెంట్ సినిమాటో గ్రాఫర్‌గా చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకున్నాక దర్శకత్వం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకొన్నారు. దీంతో కెమెరామెన్ జీవితమే తన గమ్యమా.. అని ఓసారి ఆలోచించుకొంటూ రాగా లాక్డౌన్ తన లక్ష్యం దిశగా సాగే పరిస్థితులు కల్పించింది. కెమెరా పట్టిన చేతులతో 24 క్రాఫ్ట్‌లను పర్యవేక్షించే కీలకమైన దర్శకత్వంవైపు మళ్లారు. అప్పటికే దర్శకుడి ఆలోచనలను తన కెమెరాతో ప్రతిబింబించిన ఆయన 2002లో ‘పంచతంత్ర’ కథలు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా సినీ విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుంచీ మంచి ప్రశంసలు పొందింది. తొలి ప్రయత్నంలోనే శేఖర్‌కు దర్శకుడిగా మంచి ఆరంభం లభించింది. ఇది చూసిన దర్శక దగ్గజులు కే.రాఘవేంద్రరావు ఎవరు.. ఈ సినిమా తీశారని ఆరా తీశారు. దీంతో శేఖర్‌కు వెండితెరలో తొలి ప్రశంసలు, గుర్తింపు దక్కినైట్లెంది.
కష్టాన్ని ఇష్టపడితే ఏదైనా సాధించొచ్చు గంగనమోని శేఖర్, దర్శకుడు
మాది చిన్న వ్యవసాయ కుటుంబం. సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వం నా కల. దాన్ని సాధించడానికి జేఎన్టీయూలో ఫొటోగ్రఫీ అభ్యసించి ఒక్కో మెట్టు ఎక్కుతూ కష్టపడ్డా. పంచతంత్ర కథలుతో వచ్చిన గుర్తింపుతో రాఘవేంద్రరావు స్టోరీ లైన్ విన్నవెంటనే సర్కారు నౌకరి సినిమాకు అవకాశం కల్పించారు. చిరంజీవిలాంటి ఎందరో ప్రముఖులు ట్రైలర్‌ను చూసి ప్రశంసించారు. గాయని సునీత కొడుకును వెండితెరకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. చిన్నప్పుడు ఊరిలో ఎన్నో కష్టాలు ఉండేవి. ఏడాదంతా వ్యవసాయం చేస్తే పట్టుమని పదివేలు వచ్చేవి కావు. ఇప్పుడు ప్రాజెక్టులతో నీళ్లు వచ్చి మంచిగా వ్యవసాయం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లాపూర్, నల్లమల అడవి సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైన ప్రాంతం. సింగోటం, నాయినోనిపల్లి, సోమశిల, మొలచింతలపల్లి రోడ్లు అద్భుతంగా ఉంటాయి. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇతర ఉద్యోగాల గురించి యువత ఆలోచించాల్సిన పరిస్థితులు ఉండవు. ఔటింగ్‌కు వెళ్లాలంటే అరకు ప్రాంతం ఎక్కువగా విన్నాం. కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా అలాంటి వాతావరణం ఉన్నది. సర్కారు నౌకరీ సినిమాలో కూడా సోమశిల వద్ద కృష్ణానది, ఘాట్లు, సోమశిల ఆలయం, కొల్లాపూర్ ప్రాంతాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. తగిన వనరులు కల్పిస్తే కొల్లాపూర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఇప్పుడు కొల్లాపూర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్నది. సర్కారు నౌకరి తర్వాత ప్రస్తుతం తమిళంతో పాటుగా రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. టాలెంట్ ఉంటే సినీ ఇండస్ట్రీలో రాణించవచ్చు. దర్శకత్వ ధీరుడు రాఘవేంద్రరావు వద్ద పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. నా భవిష్యత్తుకు ఈ సినిమా, రాఘవేంద్రరావు సహకారం చాలా ఉపయోగపడుతుంది.
ఆకట్టుకుంటున్న సర్కారు నౌకరి ట్రైలర్
స్వయంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పిలిపించి మెచ్చుకోవడంతో పాటు ఆర్.కే టెలీషో ద్వారా రెండో సినిమాకు ‘సర్కారు నౌకరి’కి అవకాశం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ శేఖర్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకొన్నారు. ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ సినిమా ద్వారా ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ను వెండితెరకు పరిచయం చేశా రు. 2024 జనవరి 1న ఈ సినిమా విడుదల కానున్నది. 1996లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా స్వయంగా చిన్నప్పుడు చూసిన అనుభవాలతో ఈ సినిమా తీశారు. ఆ కాలంలో ప్రస్తుతం కరోనా మాదిరి మహమ్మారిలో ప్రభావం చూపిన ఎయిడ్స్ అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడం వి శేషం. ఓ యువతికి సర్కారు నౌకరి చేసుకునే యువకుడు భర్తగా వస్తాడని భావిస్తుంటే.. పెళ్లి తర్వాత ఎయిడ్స్‌ను అరికట్టేందుకు నిరోధ్‌లు అమ్మే ఉద్యోగి తన భర్త కావడంతో ఆ కుటుంబంలో, సమాజంలో జరిగే అంశాలు ఏ విధంగా ప్రభావం చూపాయనే వాటిపై చక్కగా చిత్రీకరించారు. పలు సీన్లను కొల్లాపూర్ ప్రాంతంలోనే తీయడం విశేషం. తొలి సినిమా ‘పంచతంత్ర కథలు’లో రెండు ఎపిసోడ్లను సైతం ఇక్కడే తీశా రు.
కొల్లాపూర్, సోమశిల, సింగోటం వద్ద షూటింగ్ చేశారు. శేఖర్ అమ్మమ్మ ఊరు మొలచింతలపల్లి కావడంతో కొల్లాపూర్‌లో సినిమాలు తీసేందుకు ఉన్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నది. ఓ రోజంతా అమరగిరిలోనే షూటింగ్ నిర్వహించారు. ఇక్కడి నల్లమల అడవులు, కృష్ణా నది పరీవాహక ప్రాంతం, నీళ్లు సినిమా తీయడానికి ఎంతో అనువైన ప్రదేశాలుగా చిన్నప్పటి నుంచి శేఖర్‌కు అనుభవం. ఇలా సినిమాలు తీయడంతో నల్లమల శోభ ప్రపంచానికి చాటుతున్నారు. షూటింగ్‌లు ఇక్కడ జరిగితే స్థానికులకూ కొంత ఉ పాధి కల్పించినట్లవుతుందన్నది ఆయన ఆ లోచన. వాటర్ బాటిళ్లు, కూరగాయలు, హోటళ్లు, వాహనాలు, పెట్రోల్, డీజిల్లాంటి వాటికి రూ.2.50 కోట్లను ఈ ప్రాంతంలో సినిమా ద్వారా ఖర్చు చేశారు. ఇది తమ ప్రాంత ప్రజలకు అందించినట్లవుతుందన్నది శేఖర్ భావన. ఎత్తంలో షూటింగ్‌ను చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు ఈ ప్రాం తం బాగుందని, ఓసారి తాను కూడా వచ్చి చూస్తానని వచ్చారు. ఆ సమయంలో స్కూల్ పిల్లలకు చెప్పులు లేనిది గమనించిన వితరణ చేశారు. ఇలా తన ప్రమేయం లేకుండా, తెలియకుండా కూడా కొందరికి ఈ మాధ్య మం ద్వారా ప్రజలకు సాయం చేశాననే మంచితనం శేఖర్‌లో కనిపిస్తోంది. మొత్తం మీద నల్లమలలోని వెల్గొండ అనే చిన్న గ్రామం నుంచి వెండితెరను ఏలే లక్ష్యం తో ముందుకు సాగుతున్న గంగనమోని శేఖర్‌ను పాలమూ రు ప్రజలు ముఖ్యం గా యువత మె చ్చుకొంటున్నారు.