మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 11 : పర్యావరణ అ నుకూల మందుల తయారీలో ఉపయోగించే కారకాలు పీయూ రసాయనశాస్త్ర విభాగాధిపతి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తయారు చేయడం వల్ల పాలమూరు విశ్వవిద్యాలయానికి ఇండియన్ పేటెంట్ రైట్ లభించింది. పేటెంట్ అనేది చట్టపరమైన మేధో సంపత్తి హక్కు. ‘1-బ్రోమో-4డై మీథైల్ పిరిడీనియం బ్రోమైడ్, 1-ఐయాడో-4డై మీథైల్ పీరీడినియం ఐయాడైడ్’ అనే నూతన రేయజెంట్స్ తయారు చేయడం ద్వారా పేటెంట్ హక్కుపొందారు.
ఈ మేధోసంపత్తి వినియోగించి సామాన్య మానవుడికి, సమాజానికి అతి తక్కువ ధరలో ఔషధాలు అందించవచ్చు. సాధారణ ల్యాబ్‌లలో ఎన్నో ప్రా ణాంతక వ్యాధుల నిర్మూలనలో వాడే ఔషధాల తయారీ, వాటి చర్యాశీలత పెంచవచ్చు. ఎకో ఫ్రెండ్లీ కారణాలు తయారు చేయడం, గ్రీన్ కెమిస్ట్రీ సూత్రాలకు అనుగుణంగా డ్రగ్ పరిశ్రమల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
నిర్విరామంగా ఆరేండ్లు అనేక రకాలైన పబ్లికేషన్స్‌కు సంబంధించి న సారాంశాన్ని వడపోసి నూతన ఆవిష్కరణకు ప్రయోగకర్త డా. చంద్రకిరణ్ శ్రీకారం చుట్టారు. ఆయన తన సొంత నిధులు వెచ్చించడంతోపాటు పీహెచ్డీ స్కాలర్ స్వాతి ఫెలోషిప్ ద్వారా పొందుతున్న స్కాలర్షిప్ నుంచి 50శాతం నిధులను మొత్తం సుమారు రూ.8లక్షలకు పైగా ఖర్చు చేసి సక్సెస్ సాధించారు.
పర్యావరణ సహిత కొత్త కారకాలు కనుగొన్నారు. చెన్నై పేటెంట్ అసోసియేషన్, బాంబే పేటెంట్, ఢిల్లీ పేటెంట్ అసోసియేషన్స్‌లో అన్ని రకాల సందేహాలు నివృత్తి చేయడం, పరిశోధనాపరంగా ఎదుర్కొన్న ఇబ్బందులను, ఆన్లైన్ అడ్డంకులను అధిగమించి విజయం సాధించారు. ఈ ప్రయోగం అంతా నీటిలో, గది ఊష్ణోగ్రత వద్దే చేయడంతో ప్రత్యేక ల్యాబొరేటరీల అవసరం కూడా అంతగా ఉండదు. కారకాల వల్ల ఎటువంటి హానీ జరగదు. సమాజానికి ఉపయోగపడేలా వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో చేసిన కృషికి పేటెంట్ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇందులో తన స్కాలర్ స్వాతి పాత్ర గణనీయమైనదని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తెలిపారు.
ఈ పేటెంట్ లభించడం పాలమూరు విశ్వవిద్యాలయాలనికి అన్ని విధాలుగా ఉపయుక్తం కానున్నది. ముఖ్యంగా ఈ పేటెంట్ వాడుకోవాలంటే పరిశ్రమలు, భారీ మెడిసిన్ ఫ్యాక్టరీలు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు, పరిశ్రమలు చెల్లించే రాయల్టీలో 60 శాతం ని ధులు యూనివర్సిటీకి చెందనున్నాయి. ప్రయోగకర్తకు 40 శాతం అందుతాయి. న్యాక్‌లో ఈ పేటెంట్ వల్ల పాయింట్స్ పెరుగుతాయి. తద్వారా మెరుగైన గ్రేడింగ్ సాధించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రాజెక్టు ఫండింగ్‌కు ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పీయూకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సమాజానికి, సామాన్య మానవుడికి అతి తక్కువ ధరలో మందులు అందుతాయి.