మహబూబ్నగర్ కలెక్టరేట్ : తమను క్రమబద్ధీకరించాలని ఒప్పంద అధ్యాపకులు (Regularization) శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో ( Palamur University ) పరిపాలన భవనం ఎదుట నల్ల బ్యాడ్జెస్ ధరించి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం అడ్మిన్ నుంచి ఫార్మసీ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి , మహనీయుల జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఒప్పందపు సంఘం నాయకులు డాక్టర్ భూమయ్య మాట్లాడుతూ యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేయాలని, నెట్, సెట్ పీహెచ్డీ , పీడిఎఫ్ అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించకుండా జీవో నెంబర్ 21ను విడుదల చేయడము బాధాకరమని అన్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చాలిచాలని జీతంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.
ప్రభుత్వం స్పందించకుంటే త్వరలో సమ్మెకు వెళ్లి , యూనివర్సిటీ లను స్తంభింప చేస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒప్పంద అధ్యాపకులు శ్రీధర్ రెడ్డి, పర్వతాలు, రవికుమార్, సుదర్శన్ రెడ్డి , కర్ణాకర్ రెడ్డి , శివకుమార్ సింగ్, జిమ్మి కార్టన్, శిలాస్, వెంకటేష్, వేణు , జ్ఞానేశ్వర్, స్వాతి, అయేషా హస్మి పాల్గొన్నారు.