అమరచింత, డిసెంబర్ 21 : వడ్ల ధాన్యంతో వెళ్తున్న ఎండ్ల బండి అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో రెండు ఎద్దులు మృతిచెందిన ఘటన మండలంలోని నందిమల్ల గ్రామం లో ఆదివారం చోటు చేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు మాల నర్సింహ తన పొలంలో పండిన వడ్లను బి య్యంగా పట్టించడానికి రైస్ మిల్లుకు తీసుకెళ్తుండగా గ్రామ శివారులోని చెరువుకట్ట వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఎద్దులు భయాందోళనకు గురై ఆదుపుతప్పి బండితో సహ చెరువులోకి దూసుకెళ్లింది.
ఈక్రమంలో రైతు పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడగా రెండు ఎద్దులు మృతువాత పడ్డాయి. గమనించిన బాటసారులు ఎద్దులను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో రైతు నర్సింహులు రోధిస్తూ పండించిన పంట నీటి పాలైందని, రూ.2లక్షలు విలువైన ఎద్దులు కూడా మృతి చెం దాయని వాపోయాడు. ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.