ఊట్కూర్ : ఎంతో శ్రమకోర్చి పండించిన ఉల్లిగడ్డ ( Onion ) కుప్పకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మహాదేవ్( Kummari Mahadev ) అనే రైతు తన పొలంలో మూడు ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. ధరలు అనుకూలంగా లేకపోవడంతో కోత పెట్టిన ఉల్లిగడ్డను పొలంలోని చింత చెట్టు కింద కుప్పగా పోసి నిలువచేశాడు.
ధరలు అనుకూలంగా ఉన్న సమయంలో ఉల్లిగడ్డను విక్రయించాలని భావించిన రైతు మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. 150 బస్తాల ఉల్లిగడ్డ కుప్పకు నిప్పంటించడంతో తనకు లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా బాధిత రైతు కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బసవరాజ్ పరామర్శించారు. జరిగిన సంఘటనపై రైతుకు తగిన న్యాయం చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.