గద్వాల, మార్చి 5 : ఉల్లి.. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నది. రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి లో ఉన్నారు. లాభాలు లేకున్నా ఫర్వాలేదు.. కానీ పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో అన్నదాతలు ఉన్నా రు. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.వెయ్యి నుంచి రూ.1,250 వరకు కొనుగోలుదారులు అడుగుతుండడంతో అమ్ముకోవాలా.. వద్దా..? అక్కడే వదిలివెళ్లాలా అని తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది రూ.4 వేలకు పైగా ఉండడంతో ఈ ఏడాది కూడా అదే ధర వస్తుందని భావించి ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున ఉల్లి సాగుచేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో మార్కెట్కు తీసుకొస్తే కిరాయిలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు కొనుగోలు చేస్తూ.. వినియోగదారులకు కేజీ రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులకు ఏమి చేయాలో పాలుపోవడంలేదు. ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువునూ యజమాని ధర నిర్ణయించే అధికారం ఉన్నది.
కానీ, పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతు పండించిన ధాన్యానికి ఎవరో ధర నిర్ణయిస్తే ఇష్టం ఉన్నా.. లేకున్నా అమ్ముకునే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల, అలంపూర్, నారాయణపేట, దేవరకద్ర, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. ఇక్కడ సరైన మార్కెట్ లేకపోవడంతో కర్నూల్, హైదరాబాద్, రాయిచూర్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అక్కడ గిట్టుబాటు ధర రాకపోగా ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా రాకపోవడంతో మార్కెట్లోనే వదిలివచ్చే పరిస్థితి నెలకొందని కర్షకులు చెబుతునారు. వ్యవసాయ మార్కెట్లలో ఉల్లిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు అడిగిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
దిగుబడి లేదు.. ధర రాదు..
గతేడాది ధర బాగుండడంతో ఈ ఏడాది ఐదెకరాల్లో ఉల్లి సాగుచేశా. ఉల్లి పంటకు పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది. అయినా ధర వస్తే పెట్టుబడి దక్కుతుందని భావించా. కానీ, పంటను మార్కెట్కు తీసుకొస్తే క్వింటాకు రూ.1000 నుంచి రూ.1200 ధర పలకడం లేదు. దీంతో పెట్టుబడి రాకపోగా అప్పులయ్యేలా ఉన్నది. రైతుబంధు సాయంతో కొంత మేర అప్పుల నుంచి బయట పడ్డా.
– వీరన్న, రైతు, పచ్చర్ల
నష్టమే మిగిలింది..
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఎకరా పొలంలో ఉల్లి సాగు చేశా. తెగులు సోకడంతో పంట సరిగా రా లేదు. దీంతో నష్టపోయాను. వచ్చిన దిగుబడి పెట్టుబడికి సరిపోలేదు. దీంతో ఉల్లి పంటను మేకలకు గ్రా సంగా వాడాను. పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నిరైంది.
– హుస్సేన్, రైతు, గార్లపహాడ్