
మహబూబ్‌నగర్ డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా రెండో రోజు ఆదివారం నాటికి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 35శాఖలకు సంబంధించిన ఉద్యోగుల స్థానిక కేటాయింపులు పూర్తయినట్లు కలెక్టర్ ఎస్ వెంకటరావు పేర్కొన్నారు. ఇంకా 35శాఖలకు పైగా సంబంధించి కేటాయింపులు చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగుల కేటాయింపు విషయమై ఆదివారం సాయంత్రం అయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక పద్ధతి ప్రకారం కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
14 వరకు ప్రక్రియ
ఈ నెల 14వరకు ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి, అధికారులకు, ఉద్యోగులకు తెలియజేసేందుకు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియకు హాజరయ్యే శాఖల అధికారులు క్యాడర్ స్ట్రెంత్ సహా పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆయన కోరారు.
వివిధ శాఖల కేటాయింపులు
కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఆదివారం తన చాంబర్లో స్టేట్ ఆడిట్, జిల్లా ట్రెజరీ కార్యాల యం, కమర్షియల్ టాక్స్‌కు సంబంధించిన ఉద్యోగుల స్థానిక కేటాయింపు పూర్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామరావు ఆధ్వర్యంలో కార్మికశాఖ, పరిశ్రమలశాఖ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, జిల్లా సంక్షేమ శాఖల కేటాయింపులు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సమావేశ మందిరంలో ఉపాధికల్పన, పరిశ్రమలు, గిరిజన సంక్షేమశాఖ, టీఎస్ జీఎల్ఐలకు సంబంధించిన శాఖల ఉద్యోగుల ప్రక్రియను పూర్తిచేశారు. ఆర్డీవో, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ, వ్యవసాయ, సహకారశాఖలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.
పారదర్శకంగా కేటాయింపులు
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 అమలులో భాగంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం పక్కాగా సీనియార్టీ, ప్రత్యేక కేటగిరీల వారీగా జాబితాలు రూపొందించి, అమలు చేస్తున్నారు. కేటాయింపులకు నియమించబడిన సబ్ కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, వారి అనుమానాలు నివృత్తి చేస్తూ పారదర్శకంగా కేటాయింపులు చేస్తున్నారు. కలెక్టర్ తన దృష్టికి వచ్చిన ఉద్యోగుల సాధకబాధకాలను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో కేటాయింపులు జరుపుతున్నారు. కలెక్టర్ వెంకట్రావుకు ఉద్యోగస్తుల తరఫున కృతజ్ఞతలు.