అమ్రాబాద్, మార్చి 1 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఫిబ్రవరి 27 నుంచి శాకాహార జంతు గణన ప్రారంభమై బుధవారంతో ముగిసిందని అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. ఏటీఆర్ పరిధిలోని నాలుగు రేంజ్‌లు, 140 బీట్లలో మూడ్రోజుల పాటు లెక్కింపు చేపట్టామన్నారు.
అటవీ శాఖ ప్రత్యేకంగా తయారు చేసిన ఎమ్స్ట్రీట్స్ యాప్‌లో అడవీ ప్రాంతం నుంచే సర్వే నిర్వహించినట్లు చెప్పారు. 4 కిలోమీటర్ల బీట్ పరిధిలో ఇద్దరు అధికారుల చొప్పున 400 మీటర్లకు సంబంధించిన జంతువుల కదలిక గడ్డి, ఇదివరకు గడ్డి కాలి ఉన్న ప్రదేశం, తాకిడి, ఇతర అంశాలను ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. యాప్‌నకు సంబంధించిన గణన వివరాలు ఎన్టీసీఏ ఢిల్లీకి సంస్థ విడుదల చేస్తుందన్నారు. అటవీశాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి, ఎఫ్డీ క్షితిజ పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీట్ అధికారి నాగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.