వనపర్తి, జూలై 8 : వనపర్తి జిల్లాకేంద్రంలోని 19వార్డులో మధ్య తరగతి కుటుంబానికి చెందిన కృష్ణ, చంద్రకళ దంపతులు జీవిస్తున్నారు. వారికి మొదటి సంతానం నిఖిల్‌సాయి యాదవ్. కృష్ణ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిఖిల్ చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండడంతో కృష్ణ అతడికి మంచి భవిష్యత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా సైనిక్ స్కూల్‌కు ఎంపికైతే భవిష్యత్ బాగుంటుందని తెలుసుకున్నాడు. వెంటనే నిఖిల్‌కు ప్రత్యేక కోచింగ్ ఇప్పించాడు.
కృష్ణ కష్టాన్ని కండ్లారా చూసిన నిఖిల్ తన తండ్రి కోరికను ఎలాగైనా నెరవేర్చాలని భావించి లక్షలాది మంది రాసే పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభను కనబర్చాడు. చివరకు తండ్రి కలలు కన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా ఎంపికై నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏకు ఎంపికైన ఒకే ఒక్కడు వనపర్తికి చెందిన వ్యక్తి కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాభ్యాసం..
నిఖిల్‌సాయి యాదవ్ 1-2 తరగతులు అచ్చంపేటలో, 3 నుంచి 7వ తరగతి వరకు వనపర్తిలోని చాణక్య హైస్కూల్లో, 8వ తరగతి హైదరాబాద్‌లోని కోరకుండ సైనిక్‌స్కూల్ కోచింగ్ సెంటర్లో చదివాడు. 9వ తరగతికి విజయనగరం జిల్లా కోరకుండ సైనిక్ స్కూల్ ఎంపికై అక్కడే ఇంటర్ వరకు చదివాడు.
ప్రస్థానం ఇలా..
10వ తరగతి చదువుతున్న సమయంలో సైనిక్ స్కూల్లో ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అంశాలను వివరించడంతో నిఖిల్‌కు ఆసక్తి పెరిగింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలో యూపీఎస్సీఎన్డీఏ పరీక్ష రాశాడు. దాదాపు 12లక్షల మంది పరీక్ష రాయగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో 6వేలమంది క్వాలిఫై అయ్యారు. 2019లో సర్వీస్ సెలక్షన్ బోర్డుకు డెహ్రాడూన్‌లో 300మందికి ఇంటర్వ్యూ నిర్వహించగా అందులో 72మంది ఎయిర్‌ఫోర్స్, 30మంది నేవీ, 198మంది ఆర్మీ విభాగానికి ఎంపికయ్యారు. మొదటి ఇంటర్వ్యూలో 182 మంది రిజెక్ట్ అయ్యారు.
ఎయిర్‌ఫోర్స్‌కు 72మందిలో 68 మంది రిజెక్ట్ కాగా నలుగురు మాత్రమే ఎంపికయ్యారు. అందులో తెలంగాణ నుంచి నిఖిల్ యాదవ్ ఎంపికయ్యాడు. అనంతరం ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లేషన్లో వారంపాటు ఢిల్లీలో మెడికల్ చెకప్ నిర్వహించగా అందులో ముగ్గురే ఎంపికవగా అందులో నిఖిల్ కూడా ఉన్నాడు. అక్కడి నుంచి ఎన్డీఏ కడ్వాసుల పూణేకు 2019లో వెళ్లి 2022 వరకు ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి థియరీ పార్ట్ నేర్చుకుని 2022 జూన్‌లో హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 2023 జూన్ వరకు కోచింగ్ తీసుకున్నాడు. జూలై 2న హైద
రాబాద్‌లో నే విధుల్లో జాయిన్ అయ్యారు. 2021లో ప్రోత్సాహకం కింద సీఎం కేసీఆర్ నిఖిల్‌కు రూ.2లక్షలను తన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. 2023 జూన్ 17వ తేదీన సీజీపీ ( కామన్ గ్రాడ్యుయేషన్ పరేడ్)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కమిషన్ ఆర్డర్‌ను దేశవ్యాప్తంగా 197మంది తీసుకోగా అందులో తెలంగాణ నుంచి నిఖిల్ మాత్రమే అందుకున్నారు.
మైనస్ 4 డిగ్రీల చలిలో ఇంటర్వ్యూకు వెళ్లాడు..
చిన్నప్పటి నుంచి విమానాలతో ఆడుకునే నా కొడుకును ఎలాగైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి చేయాలని మనసులో అనుకున్న. ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పించడంతో సైనిక్స్కూల్కు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అన్ని పరీక్షల్లో ఫస్ట్‌లో ఉంటూ లక్షమంది రాసిన యూనియన్ ప్లబిక్ పరీక్షకు క్వాలిఫై అయ్యాడు. ఆ తరువాత ఇంటర్వ్యూ కోసం వెళ్లాడు. మైనస్ 4 డిగ్రీల చలిలో ఇంటర్వ్యూలో ఎంపిక కావడం ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేను. నిఖిల్ అంచెలంచెలుగా ప్రతి పరీక్ష, ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉన్నది.
– ఎల్ఐసీ కృష్ణయాదవ్, నిఖిల్ తండ్రి
చాలా ఆనందంగా ఉంది..
చిన్నప్పటి నుంచి నాన్న పడిన కష్టాలను చూస్తూ పెరిగాను. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నాన్న చెప్పిన మాటలు నా మనసులో ఉండిపోయాయి. ఈక్రమంలో సైనిక్స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడు ఎయిర్‌ఫోర్స్ అంశాలు నా మనసుల్లో నాటుకుపోయాయి. తప్పకుండా ఎయిర్‌ఫోర్స్ అధికారి కావాలన్న లక్ష్యంతో బాగా చదివాను. లక్షలాది మంది రాసిన పరీక్షలో తప్పకుండా నేను సెలక్ట్ అవుతానన్న నమ్మకం నేను మరింత ముందుకు పోయేలా చేసింది. తెలంగాణ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కమిషన్ ఆర్డర్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– నిఖిల్‌సాయి యాదవ్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి